- తరచూ సాంకేతిక సమస్యలతో విద్యత్ ఉత్పత్తికి ఆటంకం
- ఈ ఆర్థిక సంవత్సరంలోపు క్లోజ్ చేసేందుకు రంగం సిద్ధం
- సూపర్ క్రిటికల్ ప్లాంట్ ఏర్పాటుపై ఆసక్తి చూపని రాష్ట్ర ప్రభుత్వం
- ప్లాంట్ ను విస్తరించకుండా సిబ్బందిని బదిలీ చేసేందుకు చర్యలు!
గోదావరిఖని, వెలుగు : పెద్దపల్లి జిల్లా రామగుండం పట్టణంలోని 62.5 మెగావాట్ల బీ‒థర్మల్ విద్యుత్ కేంద్రం మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. పాత ప్లాంట్కావడంతో తరుచూ రిపేర్లకు రావడంతో పాటు స్పేర్ పార్ట్‌ల కొరత కూడా వేధిస్తోంది. చుట్టూ బొగ్గుగనులు, 900 ఎకరాల విశాల స్థలం ఉండడం ఈ ప్లాంట్‌కు అనుకూలాంశాలు. ఈ క్రమంలో కాలం చెల్లిన బీ– థర్మల్ ప్లాంట్‌ను తొలగించి దాని స్థానంలో 800 మెగావాట్ల సూపర్ క్రిటికల్ పవర్ ప్లాంట్ నెలకొల్పే అవకాశం ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం ఆసక్తి చూపడం లేదు. 25 ఏండ్లు దాటిన ఈ ప్లాంట్‌ను ఇప్పటికే కాలం చెల్లిన జాబితాలో చేర్చిన సర్కారు.. వచ్చే ఆర్థిక సంవత్సరం (2023–24) లోపు మూసివేసేందుకు సిద్ధమవుతోంది.
1971 నుంచి విద్యుత్ ఉత్పత్తి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో బొగ్గు, నీరు అందుబాటులో ఉండడంతో రామగుండం పట్టణంలో 1965లో అప్పటి సీఎం కాసు బ్రహ్మనందరెడ్డి 62.5 మెగావాట్లతో బీ‒థర్మల్ పవర్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేశారు. ఈ ప్లాంట్ నిర్మాణాన్ని పూర్తి చేసుకుని 1971 నుంచి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించింది. విద్యుత్ ప్లాంట్ నిర్మాణానికి రూ.14.80 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసింది.
ప్రారంభంలో 62.5 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయగా.. ప్లాంట్‌లో ఉన్న యంత్రాల స్థితిగతుల ఆధారంగా నేడు 45 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తూ గ్రిడ్‌కు అనుసంధానం చేస్తున్నారు.
25 ఏళ్లే ప్లాంట్ లైఫ్...తరుచూ సాంకేతిక సమస్యలు..
పర్యావరణ పరిస్థితుల దృష్ట్యా సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ) నిబంధనలను అనుసరించి 200 మెగావాట్లలోపు ప్రారంభించిన విద్యుత్ ప్లాంట్ల లైఫ్ 25 ఏండ్లుగానే నిర్ణయించారు. దీని ప్రకారం రామగుండంలో జెన్‌కో బీ‒థర్మల్ విద్యుత్ కేంద్రం లైఫ్ 1996 సంవత్సరానికే పూర్తి కావాల్సింది. కానీ, ఈ ప్లాంట్‌లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సీఈఏ నామ్స్‌కు లోబడి విద్యుత్ ఉత్పత్తి చేస్తుండడంతో ప్లాంట్ లైఫ్‌ను పొడిగిస్తూ వచ్చారు. ప్లాంట్‌లో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటి వరకు 52 ఏండ్లుగా పవర్ జనరేషన్ జరుగుతూనే ఉంది. అయితే, ప్లాంట్‌లో బాయిలర్ ట్యూబ్స్ లీక్ కావడం, మిల్స్, టర్బైన్ విభాగాల్లో తరుచూ సాంకేతిక సమస్యలు తలెత్తడం వంటివి గుదిబండగా మారాయి.
దీంతో విద్యుత్ ఉత్పత్తికి ఆటంకం ఏర్పడుతున్నది. షట్‌డౌన్ చేసిన ప్రతీసారి బాయిలర్ మండించేందుకు సుమారు రూ.20 లక్షల వరకు ఖర్చు చేస్తున్నారు. ఇలా చాలాసార్లు షట్‌డౌన్ అవుతుండడంతో రూ.కోట్లు వెచ్చించాల్సిన పరిస్థితి నెలకొంది. కాగా, గత నెల సెప్టెంబర్ నెలాఖరులో విద్యుత్ సౌధ నుంచి చీఫ్ ఇంజినీర్, డైరెక్టర్లు ఈ ప్లాంట్‌ను సందర్శించి రెనొవేషన్, మోడ్రనైజేషన్ (అర్‌అండ్‌ఎం)కు నిధులు కేటాయించే పరిస్థితులు లేవని అభిప్రాయపడ్డారు. నిత్యం ఏర్పడే రిపేర్లకు స్పేర్ పార్ట్‌లు లభించడం కష్టంగా మారిన పరిస్థితుల్లో వచ్చే ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి ప్లాంట్‌ను మూసివేయాలనే నిర్ణయానికే రాష్ట్ర ప్రభుత్వం వచ్చినట్లు చెప్తున్నారు.
కొత్త ప్లాంట్ నిర్మాణానికి అవకాశం ఉన్నా
కాలంచెల్లిన రామగుండం బీ‒థర్మల్ ప్లాంట్‌ను తొలగించి దాని స్థానంలో 800 మెగావాట్లు కానీ, 500 మెగావాట్లు కానీ సూపర్ క్రిటికల్ పవర్ ప్లాంట్‌ను నెలకొల్పే అవకాశం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ఈ విషయమై అవసరమైన స్థలం, ఇతర వనరుల లభ్యత కోసం నాలుగేళ్ల క్రితం జెన్‌కో ఆఫీసర్లు సర్వే కూడా చేశారు. బీ‒థర్మల్ కేంద్రానికి సుమారు 900 ఎకరాల వరకు స్థలం ఉండగా కొత్త ప్లాంట్‌ను నెలకొల్పేందుకు అనుకూలంగా ఉంటుంది. దీనికి తోడు బొగ్గు, నీరు కూడా అందుబాటులో ఉంది. ఇక్కడ విద్యుత్ ఉత్పత్తి చేస్తే రవాణా ఖర్చు తగ్గి తక్కువ ధరకే విద్యుత్ తయారవుతుంది.
ప్లాంట్‌ను విస్తరించకుండా ఇక్కడ పనిచేసే ఆఫీసర్లు, ఉద్యోగులను యాదాద్రిలోని జెన్ కో ప్లాంట్‌కు కానీ, భద్రాద్రిలోని జెన్‌కో ప్లాంట్ కు కానీ బదిలీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తున్నది. రామగుండం బీ‒థర్మల్ ప్లాంట్‌ను విస్తరించాలని గతంలో పలువులు లీడర్లు ధర్నాలు, దీక్షలు చేయగా... ప్రస్తుత ఎన్నికల సమయంలో ఈ అంశం రాజకీయ పార్టీల అభ్యర్థులకు అస్త్రంగా మారింది.