పిలగాండ్లు.. తొందరపాటు..

ఒక నదీ ప్రవాహం ఒడ్డున ఉన్న చెట్టు మీద  ఒక గూడు ఉంది. అందులో ఒక కాకి తన పిల్లలతో ఉండేది. వర్షాకాలంలో అకస్మాత్తుగా నది పొంగడం మొదలైంది. అది చూసిన కాకి ఆందోళనతో తన పిల్లని మరొక చోటికి తీసుకుపోవాలి అనుకుంది. అప్పుడే అక్కడికి వచ్చిన కుందేలుతో ‘‘కుందేలు మామా! నా బిడ్డని ఈ అడవిలో నీకు, నాకు  తెలిసిన ఊడల మర్రిచెట్టు దగ్గరకు తీసుకెళ్లు. నేను.. నీ వెనుక కొంత ఆలస్యంగా వస్తాలే’’ అంది. కుందేలు ‘సరే’ అంది. కుందేలుకు బిడ్డను అప్పగించింది కాకి. తర్వాత చాలా సేపటికి తన దగ్గర ఉన్న మరొక పిల్లను అదే మర్రిచెట్టు దగ్గరకు పట్టుకెళ్ళింది. కాకికి అక్కడ కుందేలు కనిపించలేదు. బిడ్డ కూడా లేదు. చాలాసేపు కుందేలు కోసం ఎదురు చూసింది. కానీ అక్కడికి కుందేలు రానే లేదు. తర్వాత కాకి ఆ మర్రిచెట్టు దగ్గర ఉన్న మిగతా జంతువులను కుందేలు గురించి ఆరా తీసింది.

అవి ‘మాకు తెలియద’ని చెప్పాయి. కంగారు పడిపోయిన కాకి... కుందేలును తిడుతూ తన బిడ్డ కొరకు ఏడవడం మొదలుపెట్టింది. అప్పుడే అక్కడకు వచ్చిన కుందేలుని చూసి కాకి సంతోషించింది. ‘‘నా బిడ్డను ఈ మర్రి చెట్టు మీద ఉంచమని నీకు అప్పగించా కదా. నా బిడ్డ ఏది ?” అని అడిగింది. దానికి ఆ కుందేలు ‘‘నీ బిడ్డను నాకు ఇచ్చావా? అబద్ధం!’’ అంది. అప్పుడు కాకి మిగతా పక్షులు, జంతువులతో కుందేలు తనను మోసం చేసిందని, తన బిడ్డను ఎక్కడో పడేసిందని ఏడుస్తూ చెప్పింది. ఆ కుందేలు మాత్రం ‘ఇదంతా అబద్ధం’ అంది. అక్కడున్న జంతువులకు, పక్షులకు ఎవరిది నిజమో తెలియలేదు.

ఇంతలో అక్కడికి ఒక కోతి వచ్చింది. కాకిని అడిగి విషయం తెలుసుకుంది. ‘‘అయ్యో కాకీ! ఈ కుందేలు మన అడవికి చెందిన కుందేలు కాదు. పక్క అడవి నుంచి ఇప్పుడే వచ్చింది. దీనికేమీ తెలియదు. నువ్వు బిడ్డను ఇచ్చింది ఈ కుందేలుకు కాదు. ఆ కుందేలు కొద్దిసేపటి క్రితం ఇక్కడకు వచ్చింది. ఈ మర్రిచెట్టు పైన నీ బిడ్డను ఉంచమని నన్ను అడిగింది. కానీ అప్పుడు ఈ చెట్టు మీద కొండచిలువ ఉంది. అది  నీ బిడ్డను తింటుందని, ఇక్కడికి కొద్ది దూరంలో ఉన్న రావిచెట్టు దగ్గరకు వెళ్ళమని ఆ కుందేలుకు సలహా ఇచ్చా. దాంతో అది అక్కడకు వెళ్ళిపోయింది. ఇంతకు ముందే ఆ కొండచిలువ ఇక్కడ నుండి వెళ్లిపోయింది. నువ్వు ఇప్పుడు ఇక్కడ హాయిగా ఉండొచ్చు. అదిగో నువ్వు పిల్లని ఇచ్చిన కుందేలు ఇటువైపు వస్తోంది చూడు’’ అంది కోతి.  బిడ్డను తీసుకుని అక్కడికి వచ్చిన కుందేలు కాకికి బిడ్డను అప్పగించి, జరిగిన విషయమంతా చెప్పింది. కాకి తాను తొందరపడి కుందేలును అపార్థం చేసుకున్నందుకు క్షమాపణ కోరింది. ఆ తర్వాత  కాకి తనకు మేలు చేసినందుకు కోతికి కూడా ధన్యవాదాలు తెలిపింది. 

నీతి: కారణం తెలుసుకోకుండా  ఇతరులను, అందులో మనకు మేలు చేసేవారిని తొందరపడి దూషించకూడదు.- సంగనభట్ల చిన్న రామకిష్టయ్య