ఘనంగా రామకృష్ణ పరమహంస జన్మదిన వేడుకలు

ఘనంగా రామకృష్ణ పరమహంస జన్మదిన వేడుకలు

హైదరాబాద్: దోమలగూడలోని రామకృష్ణ మఠంలో రామకృష్ణ పరమహంస 190వ జన్మదిన వేడుకలు కన్నుల పండువగా జరిగాయి. భగవాన్ శ్రీ రామకృష్ణ పరమహంస తమ దివ్యస్పర్శతో కాఠిన్య హృదయాలను ద్రవింప చేయగలిగారని హైదరాబాద్ రామకృష్ణ మఠం అధ్యక్షుడు స్వామి బోధమయానంద చెప్పారు. గిరీష్ చంద్ర ఘోష్, కేశవ చంద్రసేన్ వంటి ఉద్ధండుల జీవితాలు శ్రీరామకృష్ణ స్పర్శతో చరితార్థం అయ్యాయని చెప్పారు. 

రామకృష్ణ బోధనలతో వారిలో ఆధ్యాత్మిక సంస్కారాలు జాగృతమయ్యాయని ఆయన గుర్తు చేశారు.  సంకల్పమాత్రాన స్వామి వివేకానందలో చైతన్య స్థాయిని పెంచి హైందవ సంస్కృతీ వారసత్వాన్ని సమర్థించేలా రామకృష్ణ పరమహంస చేశారని ఆయన గుర్తు చేశారు. గురుదేవుల స్పర్శ విమర్శనా దృక్పథం గల అన్వేషి అయిన స్వామి వివేకానందను ప్రచండ భక్తుడిగా మార్చి వేసిందని బోధమయానంద గుర్తు చేశారు. 

గురుదేవుల దివ్య స్పర్శ పరుసవేదిలా మారి సామాన్యులను సాధువులుగా మార్చివేసిందన్నారు. రామకృష్ణ పరమహంస తన వద్దకు వచ్చిన ప్రతి ఒక్కరిని అక్కున చేర్చుకుని ఉద్ధరించిన కరుణా సింధువని స్వామి బోధమయానంద కొనియాడారు.

కార్యక్రమంలో భాగంగా బాల్ వికాస్ విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. శ్రీజా బృందం సంతూర్ వాదన ఆహుతులను ఆధ్యాత్మిక సాగరంలో ముంచెత్తింది.