కొత్త సీఎస్‌‌గా రామకృష్ణారావు?.. శాంతికుమారికి ఆర్టీఐ చీఫ్ కమిషనర్ పదవి

కొత్త సీఎస్‌‌గా రామకృష్ణారావు?..  శాంతికుమారికి ఆర్టీఐ చీఫ్ కమిషనర్ పదవి
  • సమాలోచనలు చేస్తున్న ప్రభుత్వం
  • హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్, సభ్యుల ఎంపిక పూర్తి 
  • లోకాయుక్త, ఉప లోకాయుక్త కూడా.. 
  • గవర్నర్‌‌‌‌ ఆమోదానికి లిస్టు 
  • ఆర్టీఐ కమిషనర్ల ఎంపిక పెండింగ్ 
  • సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో  ఎంపిక సమావేశాలు.. హాజరుకాని ప్రతిపక్ష నేత కేసీఆర్ 

హైదరాబాద్, వెలుగు: కొత్త సీఎస్‌‌గా సీనియర్ ఐఏఎస్ రామకృష్ణారావును నియమించాలని సీఎం రేవంత్ రెడ్డి సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు తెలిసింది. ప్రస్తుత సీఎస్​ శాంతి కుమారి ఈ నెలాఖరున రిటైర్‌‌ కానున్నారు. ఆమె ఆర్టీఐ చీఫ్ కమిషనర్‌‌ పదవి ఆశిస్తున్నట్లు తెలిసింది. ఇందుకోసం వీఆర్ఎస్ తీసుకునేందుకు కూడా రెడీ అయినట్టు తెలుస్తున్నది. దీంతో శాంతికుమారి స్థానంలో కొత్త సీఎస్‌‌గా రామకృష్ణారావును నియమించే అవకాశముంది. నిజానికి సీనియారిటీ పరంగా ఐఏఎస్ అధికారి శశాంక్ గోయల్ ముందున్నారు. 

కానీ ఆర్థిక శాఖలో రామకృష్ణారావుకు ఉన్న సుదీర్ఘ అనుభవం, తెలంగాణ పరిస్థితులపై పూర్తి అవగాహన ఉండడంతో ఆయన వైపు ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్టు తెలిసింది.  స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్, సభ్యులతో పాటు లోకాయుక్త, ఉప- లోకాయుక్తల ఎంపిక పూర్తయింది. ఆయా పేర్లతో కూడిన సిఫార్సులు గవర్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చేరాయి. ప్రధాన సమాచార కమిషనర్, ఇతర సమాచార కమిషనర్ల లిస్టును మాత్రం ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గవర్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఇంకా పంపలేదు. ఈ మూడు రాజ్యాంగ సంస్థల నియామకాల కోసం సెక్రటేరియెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో శనివారం సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో  వేర్వేరు సమావేశాలు జరిగాయి. 

ఈ సమావేశాలకు ప్రతిపక్ష నేత కేసీఆర్ హాజరు కావాల్సి ఉండగా, ప్రభుత్వం అధికారికంగా సమాచారం పంపింది. కానీ ఆయన హాజరుకాలేదు. హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్, సభ్యుల ఎంపిక కోసం సీఎం రేవంత్ రెడ్డి, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సమావేశమయ్యారు. అభ్యర్థుల ఎంపిక పూర్తి చేసి గవర్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు పంపారు. ఒకటి, రెండు రోజుల్లో గవర్నర్ ఆమోదం లభిస్తుందని అధికార వర్గాలు వెల్లడించాయి. లోకాయుక్త, ఉప-లోకాయుక్తకు రిటైర్డ్ జడ్జీలను ఎంపిక చేశారు. రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్, కమిషనర్ల ఎంపికపై సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమావేశమయ్యారు. 

కానీ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. చీఫ్ కమిషనర్ పోస్టును ఈ నెలాఖరున రిటైర్ కానున్న చీఫ్ సెక్రటరీ శాంతికుమారి ఆశిస్తున్నట్టు తెలిసింది. ఇందుకోసం ఆమె వీఆర్ఎస్ తీసుకునేందుకు రెడీ అయినట్టు సమాచారం. అన్నీ అనుకూలిస్తే ఈ నెల 7న తన బర్త్ డే సందర్భంగా శాంతికుమారి వీఆర్ఎస్ తీసుకోవడంతో పాటు అదే రోజు ప్రధాన సమాచార కమిషనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని చర్చ జరుగుతున్నది.