ఆర్కేపీ ఓపెన్ కాస్ట్​లో బొగ్గు నిల్వలు నిల్

ఆర్కేపీ ఓపెన్ కాస్ట్​లో బొగ్గు నిల్వలు నిల్
  • స్టాక్ కోల్​ పూర్తిగా తరలించిన సింగరేణి 

కోల్ బెల్ట్, వెలుగు: మందమర్రి ఏరియా రామకృష్ణాపూర్​ ఓపెన్​కాస్ట్​ బొగ్గు గని మూసివేతకు రంగం సిద్దమైంది.  ఓసీపీ కోల్​యార్డ్​లో ఉన్న స్టాక్​ కోల్​ను మంగళవారం నాటికి పూర్తిగా రవాణా చేశారు. మరోవైపు క్వారీలో బొగ్గు ఉత్పత్తి పనులు చాల రోజు కిందటనే నిలిచిపోవడంతో ఓసీపీ భవిష్యత్​ ప్రశ్నార్థకంగా మారింది. రెండో ఫేజ్​లో సేకరించాల్సిన భూములకు అటవీ పర్మిషన్లు రాకపోవడంతో గని మూసివేయక తప్పని పరిస్థితి నెలకొంది. మూసివేసిన ఆర్కే4, ఎంకే4,4ఏ అండర్​ గ్రౌండ్​ మైన్ల స్థానంలో 2013లో రామకృష్ణాపూర్​ ఓపెన్​కాస్ట్​ గనిని ఏర్పాటు చేశారు. 2014లో గనిలో బొగ్గు ఉత్పత్తి ప్రారంభమైంది. మొదటిఫేజ్ పర్మిషన్లతో సుమారు 11 ఏళ్ల పాటు గనిలో బొగ్గు ఉత్పత్తి చేపట్టారు. సుమారు 2.11కోట్ల టన్నుల బొగ్గు ఉత్పత్తి టార్గెట్​ పెట్టుకోగా 2024-25 ఆర్థిక సంవత్సరం ఇప్పటి వరకు 1.60 కోట్ల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేశారు.

మొదటిఫేజ్​-1 పర్మిషన్లు ఈ ఏడాది జూన్​ వరకు ఉన్నప్పటికి బొగ్గు వెలికితీతకు అవసరమైన భూమిలేకుండా పొయింది.  రెండో ఫేజ్​-2లో గనికి అవసరమైన 375 హెక్టార్ల ఫారెస్ట్​ భూమి, 600 హెక్టార్ల నాన్​ ఫారెస్ట్​ భూములను సేకరించిన తర్వాత అక్కడ బొగ్గు ఉత్పత్తి ప్రక్రియ చేపట్టాల్సి ఉంది. ఈ భూముల్లో 25 మిలియన్​ టన్నుల బొగ్గు నిక్షేపాలుండగా మరో 12 నుంచి 14 ఏళ్ల వరకు గనిలో మైనింగ్​ తవ్వకాలు చేపట్టే వీలుంది. ప్రాజెక్టు విస్తరణ కోసం రెండో ఫేజ్​లో సేకరించాల్సిన భూములు అటవీశాఖ పరిధిలో ఉండటంతో కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ పర్మిషన్ల కోసం ఎదురుచూడాల్సి వస్తోంది. 

భూసేకరణ పర్మిషన్ రావడానికి మరో ఏడాదిన్నర కాలం పట్టే అవకాశం ఉంది. మరోవైపు గనిలో బొగ్గు ఉత్పత్తి, ఓవర్ బర్డెన్​ వెలికితీసే పనులను ప్రైవేటు ఓబీ కాంట్రాక్ట్​ కంపెనీ అక్టోబర్​ నాటికే నిలిపివేసింది. డిసెంబర్​ నెలాఖరునాటికి బొగ్గు ప్రక్రియ చేపట్టి జనవరిలో గనిని మూసివేయాలని భావించిన కార్మికులు, కార్మిక సంఘాల ఒత్తిడితో యాజమాన్యం  మార్చి వరకు పొడగించారు.గనిలో మొదట్లో సుమారు 300 వరకు ఉద్యోగులు పనిచేయగా క్రమేణా వారి సంఖ్య 140కి పడిపోయింది. గని మూసివేత నేపథ్యంలో గని మేనేజర్​తో పాటు మరో ఐదు ఓవర్​మెన్లను సైతం ఇటీవల బదిలీ చేసింది. 

స్టాక్​ కోల్​ ఖాళీ…

 15 రోజుల కిందట వరకు యార్డులోని స్టాక్​ కోల్​ రోజుకు 3,500 టన్నులను రవాణా చేయగా గడిచిన వారం నుంచి 2,500 టన్నులు మాత్రమే చేస్తోంది. మంగళవారం నాటికి స్టాల్​ కోల్​ సైతం పూర్తిగా ట్రాన్స్​ఫోర్ట్​ చేయడంతో యార్డ్​లో బొగ్గుపెళ్ల లేక బోసిపోయింది. అయితే గని క్వారీలో మరో 35వేల కోల్​ ఉందని, ఉత్పత్తి చేసే వీలున్న యాజమాన్యం పట్టించుకోవడంలేదని కార్మికులు పేర్కొంటున్నారు.