వేడుకల్లో పాల్గొన్న గడ్డం వంశీకృష్ణ
కోల్ బెల్ట్ /జైపూర్/కోటపల్లి, వెలుగు: రామకృష్ణాపుర్ వేంకటేశ్వరస్వామి ఆలయంలో గోదారంగనాథ స్వామి కల్యాణోత్సవం ఘనంగా జరిగింది. ఆదివారం ఆలయంలో వేదపండితులు ఆధ్వర్యంలో కల్యాణోత్సవం నిర్వహించారు. వేడుకల్లో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి తనయుడు, కాంగ్రెస్ యువ నేత గడ్డం వంశీకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన సామూహిక అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు.
ఆలయ ఆవరణలో షెడ్ నిర్మాణానికి సహకరిస్తానని ఆలయ కమిటీకి హామీ ఇచ్చారు. భీమారం మండల కేంద్రంలోని శ్రీ కోందండ రామాలయంలో గోదాదేవి రంగనాయకుల కల్యాణం వైభవంగా సాగింది. ఈ వేడుకల్లోనూ గడ్డం వంశీకృష్ణ పాల్గొని ఎంపీటీసీ చేకుర్తి సరోజ, సత్యనారాయణ రెడ్డితో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం బూరుగుపల్లి గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ లీడర్లు స్థానికంగా రోడ్లు నిర్మించాలని, తాగు నీటి సమస్య పరిష్కరించాలని వంశీకృష్ణకు వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ విశ్వంబర్, గుడి కమిటీ మెంబర్లు ఆవుల సురేశ్, కిర్య బాబు, నరేశ్, రంజిత్ రెడ్డి, అనిల్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
కాలభైరవస్వామి సేవలో..
కోటపల్లి మండలంలోని పారుపల్లి గ్రామంలోని కాలభైరవ స్వామిని గడ్డం వంశీకృష్ణ దర్శించుకున్నారు. స్వామి ఆశీస్సులు చెన్నూర్ నియోజకవర్గ ప్రజలు, పెద్దపల్లి పార్లమెంటు ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని కోరారు. బీఆర్ఎస్ నియంత పాలనకు స్వస్తి చెప్పి గెలిపించుకున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉన్నారని అన్నారు. ఆయన వెంట కోటపల్లి మండల కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.
బెల్లంపల్లి, మామడలోనూ..
బెల్లంపల్లి పట్టణం సుభాష్ నగర్లోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేద పండితులు చిమిరాల దామోదర చార్యులు, శ్రీ చిమిరాల శ్రీనివాసాచార్యులు స్వామివారి ఉత్సవమూర్తులను అలంకరించి కల్యాణోత్సవాన్ని నిర్వహించారు. మామడ మండలం పోన్కల్ గ్రామంలోని వేంకటేశ్వర ఆలయంలో 30 రోజుల పాటు జరిగిన ధనుర్మాస ఉత్సవాలు వైభవంగా ముగిశాయి. గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. వేడుకల్లో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కూచాడి శ్రీహరి రావు పాల్గొని, ప్రత్యేక పూజలు చేశారు.