నార్కట్పల్లి, వెలుగు: చెరువుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తామని ఆర్‌అండ్‌బీ మంత్రి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు. బుధవారం సెక్రటేరియట్‌లో చెర్వుగట్టు బ్రహ్మోత్సవాల నిర్వహణపై ఎమ్మెల్యే వేముల వీరేశం, ఎండోమెంట్ కమిషనర్ అనిల్ కుమార్‌తో కలిసి సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వామి వారికి కల్యాణోత్సవానికి అధికారికంగా తలంబ్రాలు సమర్పిస్తామని, ఈ ఘట్టాన్ని భక్తులు తిలకించేలా ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. తెలంగాణ, ఏపీ నుంచి లక్షల మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున వారి కోసం భోజనం, రాత్రి బస చేసేందుకు గుడారాలు, తాగనీరు, మరుగుదొడ్లు లాంటి సౌకర్యాలు కల్పించాలని సూచించారు.
జాతరకు వచ్చిపోయే దారుల్లో రెండు వరసల్లో డెకరేషన్ లైట్లను ఏర్పాట్లు చేయాలని, ఎక్కడా విద్యుత్ సమస్యలు రాకుండా చూడాలని ఆదేశించారు. అనంతరం బ్రహ్మోత్సవాల పోస్టర్, సమాచార కరపత్రాన్ని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ మహేంద్రకుమార్,ఈవో నవీన్, దేవస్థాన ప్రధాన అర్చకుడు పోతులపల్లి రామలింగేశ్వర శర్మ,వడ్డే భూపాల్ రెడ్డి, రేగట్టె నరసింహ్మరెడ్డి, నేతగాని కృష్ణయ్య, శశిధర్ రెడ్డి పాల్గొన్నారు.