హైదరాబాద్​ విమోచనోద్యమ దార్శనికుడు రామానంద తీర్థ

స్వామి రామానంద తీర్థ జీవితమే ఒక స్వాతంత్య్ర సంగ్రామం. నిజాం నియంతృత్వాన్ని ఎదిరించి పోరాడారు. హైదరాబాద్​ విమోచన ఉద్యమంలో నిర్మాణాత్మక పాత్ర పోషించారు. కర్నాటకలోని బీజాపూర్​జిల్లా సిందగీ అనే గ్రామంలో 1903 అక్టోబర్​3న రామానంద తీర్థ జన్మించారు. బాల్యంలో ఆయన పేరు వెంకటేశ భగవంతరావు కెటగీకర్. చదువు పూర్తయిన వెంటనే ఎన్ఎం జోషీ నాయకత్వంలో కమ్యూనిస్టు పార్టీలో కార్యకర్తగా చేరారు. కమ్యూనిస్టు పార్టీ సైద్ధాంతికత సంతృప్తికరంగా లేనందున ఉపాధ్యాయ వృత్తి చేపట్టారు. మాతృభాష పట్ల, ప్రజాస్వామ్య విలువలు, జాతీయ సంస్కృతి గురించి, స్వాతంత్ర్యోద్యమం గురించి విద్యార్థులను చైతన్యం చేశారు. మాతృభాషా బోధన చేస్తున్నందుకు, ముక్తిసంగ్రామ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నందుకు నిజాం ప్రభుత్వం స్వామీజీని అనేక రకాల హింసలకు గురిచేసింది.1930 జనవరి14న  ప్రముఖ ఆధ్యాత్మిక గురువు నారాయణ స్వామి వద్ద వెంకటేశ భగవంతరావు బ్రహ్మచర్య సన్యాసి దీక్ష తీసుకోవడంతో, ఆరోజు నుంచి ఆయన పేరు ‘స్వామి రామానంద తీర్థ’ గా మారింది. ఈ దీక్ష తదుపరి ప్రజల్లో జాతీయ భావాలను పెంపొందించే లక్ష్యంతో ముందుకు సాగారు. అలాంటి జాతీయ స్ఫూర్తిగల యువకుల సహకారంతో హైదరాబాద్​సంస్థాన విమోచనా ఉద్యమానికి స్వామీజీ గట్టి పునాదులు వేశారు.

కాంగ్రెస్​ పార్టీ నాయకత్వం చేపట్టి..

హైదరాబాద్​సంస్థానంలో కాంగ్రెస్​ పార్టీ అధ్యక్షుడిగా రామనంద తీర్థ ఎన్నికయ్యారు. నిజాం వ్యతిరేక ఉద్యమాలు తెలంగాణ, మరాఠ్వాడల్లో తీవ్రంగా వ్యాపించాయి. పట్టణ ప్రాంతాల్లో గ్రం థాలయాల స్థాపన, ప్రాంతీయ భాషాబోధన కార్యక్రమాల్లో మేధావులు, న్యాయవాదులు, ఉద్యమకారులు ముక్తి సంగ్రామ ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి సాధనాలుగా తోడ్పడ్డారు. ​సంస్థానంలో ఒకవైపు విమోచన ఉద్యమాలు, మరోవైపు రజాకార్ల ఆగడాలు, ఇంకోవైపు విలీనానికి ససేమిరా అంటున్న నిజాం.. వీటన్నింటినీ గమనించిన కేంద్ర ప్రభుత్వం 5 రోజుల పాటు పోలీస్​ యాక్షన్​ చేపట్టి హైదరాబాద్ ​సంస్థానానికి విమోచన కల్పించింది. స్వామీజీ ఉద్యమ లక్ష్యం నెరవేరింది.

గాంధీజీ బాటలో..

జాతిపిత గాంధీజీ సిద్ధాంతాలతో స్వామీజీ ప్రభావితులయ్యారు.హైదరాబాద్​విమోచనా ఉద్యమంలో అగ్రగామిగా నిలిచారు.1938లో ముక్తి సంగ్రామ పేరుతో ప్రారంభమైన వారి ఉద్యమం17 సెప్టెంబర్1948 వరకు కొనసాగింది. హైదరాబాద్​ సంస్థానం భారత ప్రభుత్వంలో విలీనం కావడానికి స్వామీజీ చేసిన కృషి ఒక చారిత్రక పరిణామం. భారత మాజీ ప్రధాని పీవీ నర్సింహరావు అధికారంలో ఉండగా స్వామీజీ జ్ఞాపకార్థం రామానంద తీర్థ గ్రామీణ, ఆర్థిక, సామాజిక పరిశోధనా సంస్థను హైదరాబాద్​లో నెలకొల్పారు. 1999లో స్వామీజీ పేరున తపాళా బిళ్లను కూడా విడుదల చేశారు. హైదరాబాద్​విమోచన ఉద్యమం తర్వాత స్వామీజీ 1957లో గుల్బర్గా నుంచి, 1962లో ఔరంగాబాద్ నుంచి లోక్​సభకు ఎన్నికయ్యారు. రాజకీయాల్లో నీతి, నిజాయితీ లేకపోవడం, అవినీతి పెరిగిపోవడం చిత్తశుద్ధిలేని పాలన వంటి అంశాలతో రాజీపడలేక ఆయన రాజకీయాల నుంచి తప్పుకున్నారు. తన జీవితాన్ని భారత జాతి కోసం అంకితం చేసిన స్వామి రామానంద తీర్థ 1972 జనవరి 22న కన్నుమూశారు. 

–డా. హారతి ద్వారకనాథ్, సోషల్ ​ఎనలిస్ట్​