జయశంకర్ భూపాలపల్లి/వెంకటాపూర్ (రామప్ప), వెలుగు : ప్రపంచ వారసత్వ ఉత్సవాలకు భూపాలపల్లి జిల్లా రామప్ప టెంపుల్ ముస్తాబైంది. ‘శిల్పం.. వర్ణం.. కృష్ణం.. సెలబ్రేటింగ్ ది హెరిటేజ్ రామప్ప’ పేరిట సెంట్రల్ ఆర్కియాలజీ, తెలంగాణ టూరిజం డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించనున్నారు. ఉత్సవాల్లో భాగంగా ఫుడ్ ఫెస్టివల్, మ్యూజిక్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయనున్నారు. ఈ ఉత్సవాలకు మంత్రులు, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు భారీ సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉండడంతో అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేస్తున్నారు.
ముగ్గురు మంత్రులు.. 300 మంది కళాకారులు
రామప్ప ఉత్సవాలకు ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, గిరిజన, స్త్రీ శిశుసంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. ఉత్సవాల్లో భాగంగా సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు నిర్వహించే సాంస్కృ-తిక కార్యక్రమాలకు సంగీత దర్శకుడు ఎస్‌ఎస్. తమన్, డ్రమ్ వాయిద్యకారుడు శివమణి, ఫ్లూటిస్ట్ నవీన్, సింగర్ కార్తీక్‌తో పాటు 300 మంది కళాకారులు హాజరుకానున్నారు. వీరితో పాటు అరబ్బీ ఇన్స్టిట్యూట్కు చెందిన వారితో వయోలిన్, పేరిణి నృత్యం, రావణ టోల్ స్టోరీ ఆఫ్ ది 11 హెడ్ బెంగళూరుకు చెందిన సూర్య ఎస్.రావు హెరిటేజ్ ఆఫ్ ఇండియా శ్రావ్య, మానస ప్రదర్శనలు ఇవ్వనున్నారు. అలాగే బలగం చిత్ర యూనిట్ కూడా పాల్గొననుంది.
వివిధ ప్రాంతాల నుంచి స్పెషల్ బస్సులు
రామప్ప ఉత్సవాలకు ప్రజాప్రతినిధులతో పాటు 20 వేల మంది హాజరయ్యే అవకాశం ఉన్నందున అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేస్తున్నారు. మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు హన్మకొండ, ములుగు నుంచి రామప్ప వరకు ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులు నడిపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అడిషనల్ కలెక్టర్ వైవీ.గణేశ్ చెప్పారు.
కార్యక్రమాల వివరాలు
- రామప్ప ఉత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రామప్ప సరస్సు కట్టపై ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించనున్నారు.
- సాయంత్రం 5.30 గంటల నుంచి 6 గంటల వరకు అరబ్బీ వాయిద్య కళాకారుడు గురూజీ అశోక్ గుజ్జల్ ప్రదర్శన
- 6 గంటల నుంచి 6.15 వరకు జ్యోతి ప్రజ్వలన
- 6:15 నుంచి 6.25 వరకు పేరిణి రాజ్‌కుమార్ బృందంతో నృత్య ప్రదర్శన
- 6.30 గంటలకు రామప్ప వారసత్వంపై వీడియో ప్రదర్శన
- 6.55 గంటల నుంచి రాత్రి 7.20 వరకు భారత సంస్కృతి సంప్రదాయ గిరిజన నృత్య ప్రదర్శనలు
- రాత్రి 7.20 గంటల నుంచి 7.30 వరకు బలగం చిత్ర బృందానికి సన్మానం
- 7.30 గంటల నుంచి 7.45 వరుక విద్యాజ్యోతి రచించిన ‘రామప్ప ఆలయం నిత్యం శాస్త్రం’ పుస్తకావిష్కరణ
- 7.45 గంటల నుంచి 7.50 వరకు రామప్ప చరిత్రపై లేజర్ షో
- 8 గంటల నుంచి 8.15 వరకు కళాకారులు, అతిథులు, దాతలకు సన్మానం
- 8.15 నుంచి 9.45 వరకు ఎస్‌ఎస్ తమన్, శివమణి, కార్తీక్, ఫ్లూట్ నవీన్ ఆధ్వర్యంలో సంగీత ప్రదర్శన
- రాత్రి 9.45 గంటలకు ముగింపు కార్యక్రమం నిర్వహించనున్నారు.