రామప్ప దశ మారాలి

అద్భుతమైన శిల్ప కళా సంపదకు నిలయం రామప్ప దేవాలయం. 800 ఏండ్ల క్రితం కాకతీయులు నిర్మించిన ఈ చారిత్రక కట్టడానికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఇసుక పునాదులపై ఆలయాన్ని నిర్మించారు. ఇందులో నిర్మించిన శివాలయం ఉత్తర, దక్షిణ భారత దేవాలయ నిర్మాణ శైలికి ప్రతీకగా పేరుపొందింది. నీటిలో తేలే ఇటుకలు ఇక్కడ ఉన్న మరో అద్భుతం. ప్రతి శిల్పం ఒక కళాఖండం అనే చెప్పాలి. ఇక్కడకు వచ్చే టూరిస్టులను శిల్పకళా నైపుణ్యం కట్టిపడేస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. రాగాలు పలికే శిలలు, వైవిధ్యంగా చెక్కిన ఏనుగుల బొమ్మలు, నాట్యశాస్త్రానికి ప్రతీకలుగా నిలిచే శిల్పాలు ఆలయ స్తంభాల మీద కనువిందు చేస్తాయి. స్వాగత ద్వారం వద్ద ఉన్న నాట్యమాడుతున్నట్టుగా ఉండే విగ్రహాలు. ఒకటేమిటి రామప్ప దేవాలయంలోని ప్రతి స్తంభానికి, ప్రతి శిల్పానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఆలయ నిర్మాణానికి వాడిన రాయి నేటికీ చెక్కుచెదరలేదు. కనీసం రంగు కూడా మారలేదు. సానబెట్టే కొద్దీ వజ్రానికి వన్నె వస్తుందన్నట్టుగా.. దశాబ్దాలు గడిచే కొద్దీ రామప్ప రాతి కట్టడాల ఆకర్షణ మరింత పెరుగుతోందా అన్నట్టుగా రోజురోజుకీ శిల్పాల ఆకర్షణ రెట్టింపవుతోంది. అందుకేనేమో మన రామప్ప దేవాలయానికి వరల్డ్ హెరిటేజ్‌‌‌‌ హోదా దక్కింది. చైనాలోని ఫ్యుజులో 2021 జులై 16 నుంచి 31 వరకు జరిగిన వరల్డ్ హెరిటేజ్ 44వ సమావేశంలో మన రామప్పకు ప్రపంచ వారసత్వ హోదాకు ఎంపిక చేశారు.

ఆలస్యంగానైనా.. 

అనేక చారిత్రక వైభవాలకు ఆలవాలమైన రామప్ప గుడికి ఆలస్యంగానైన ప్రపంచ వారసత్వ హోదా దక్కడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకున్నందుకు సంతోషంగా ఉంది. వారసత్వ హోదా ప్రకటించిన యునెస్కోకు, ఓటింగులో సహకరించిన వివిధ దేశాల ప్రతినిధులకు ధన్యవాదాలు. ఈ పరిణామం యావత్ జాతికి ముఖ్యంగా తెలుగు వారందరికీ గర్వకారణం. ఈ దేవాలయాన్ని నిర్మించిన శిల్పి ‘రామప్ప’ పేరిట ప్రాచుర్యం పొందడం మరో విశేషం. యునెస్కో గుర్తింపు పొందిన అత్యధిక కట్టడాలు కలిగిన దేశాల జాబితాలో ఇటలీ 57, చైనా 55, జర్మనీ 48, స్పెయిన్ 48, ఫ్రాన్స్ 47లు మనకన్నా ముందున్నాయి. మనదేశం నుంచి విశిష్ట గుర్తింపు పొందిన 39 స్థలాల్లో ఒకటిగా ఇన్నాళ్లకు రామప్పకు చోటు దక్కింది. ప్రపంచంలోని 167 దేశాల్లో 1,126 కట్టడాలు, ప్రాంతాలకు ఇంతవరకు ప్రపంచ వారసత్వ హోదా కల్పించారు. అలా గుర్తింపు లభించిన కొద్దికాలంలోనే అక్కడ పర్యాటకుల తాకిడి పెరగడం సాధారణంగానే జరుగుతుంది. దానికి తోడు ఆ ప్రభుత్వాలు మౌలిక సదుపాయాలు, వసతులతో పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుంది. విదేశీ మారక ద్రవ్యం కూడా పెరుగుతుంది. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న హోదా ఆలస్యంగానైనా దక్కింది. 

12 ఏండ్లు గడుస్తున్నా..

పర్యాటకుల కోసం కాటేజీలు, హోటళ్లు, పార్కింగ్ స్థలం, రోడ్ల నిర్మాణాలు, పరిసర ప్రాంతాల అభివృద్ధి పనులు, తదితర ఏర్పాట్లు ముందుకు సాగడం లేదు. యునెస్కో షరతుల్లో కామేశ్వర ఆలయ పునర్నిర్మాణం కూడా ఒకటి. 12 ఏండ్లు గడుస్తున్నా కామేశ్వర ఆలయ నిర్మాణ పనులు ఇంకా ప్రారంభం కాలేదు. అలాగే రామప్ప పరిసరాల్లో 16 ఉపాలయాలున్నాయి. పురాతన ఆలయాల పునర్నిర్మాణం, పునరుద్దరణ, పనులను నిపుణులు, స్తపతుల ఆధ్వర్యంలో చేపట్టాల్సి ఉండగా ఇంతవరకు వారిని గుర్తించలేదు.  కేంద్ర, రాష్ట్ర పురావస్తు శాఖ, ఇరిగేషన్, టూరిజం, రెవెన్యూ తదితర శాఖలతో అభివృద్ధి కమిటీలు ఏర్పాటు చేసి, అభివృద్ధి పనులపై సమీక్షలు నిర్వహించాలని, త్వరితగతిన నిర్ణయాలు తీసుకుని,  పనులను వేగవంతం చేయాలని హైకోర్టు సూచించింది. అయినా ఆ వైపుగా అడుగులు పడుతున్నట్టుగా కనిపించడం లేదు. మరోవైపు ఆలయ పరిసరాల అభివృద్ధికి చేపట్టాల్సిన భూసేకరణ మొదలు కాలేదు. 

నిర్లక్ష్యం వద్దు..

ఆలయ విశిష్టతను ప్రపంచం గుర్తించినా పాలకుల నిర్లక్ష్యంతో దాని ప్రతిష్ట  కనుమరుగుకాకూడదు. ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చుకొని ఆ నిధులకు తోడు పర్యాటకులకు అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలు కల్పించడంలో నిర్లక్ష్యం ఏ మాత్రం పనికిరాదు. ఈ హోదాతో తెలుగు ప్రజల్లో కలిగిన ఆనందాలు కలకాలం నిలవాలంటే యునెస్కో విధించిన షరతులను తప్పనిసరిగా పాటించి,  ఆ దిశగా అభివృద్ధి పనులు పూర్తిచేయాలి. ప్రకృతి వైపరీత్యాల బారినుండి కాపాడేలా దీన్ని సంరక్షించడంతోపాటు, వారసత్వ సంపదను రేపటి తరానికి భద్రంగా అందించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే కార్యాచరణను రూపొందించాలి. మిగిలిన గడువు ఏడాది మాత్రమే. కావున నిధులు కేటాయించి, సమీక్ష, పర్యవేక్షణలు పెంచి నాణ్యతతో కూడిన అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలు కల్పించాలి. మన దేశానికి దక్కిన అరుదైన గౌరవాన్ని నిలబెట్టుకోవాలి. లక్ష్యాన్ని చేరుకోలేకపోతే
 “మన వేలితో మన కంట్లో పొడుచుకున్నట్లే" నని భావించండి. వెంటనే అభివృద్ధి పనులను ప్రారంభించండి.

సాధించుకున్న హోదాను నిలబెట్టుకోవాలి

కేంద్ర, రాష్ట్ర పురావస్తు శాఖలు, కాకతీయ హెరిటేజ్ ట్రస్టుల కృషితో సాధించుకున్న హోదాకు యునెస్కో కొన్ని షరతులు విధించింది. వాటి ప్రకారం ఉపాలయాల పునర్నిర్మాణం, పునరుద్దరణ, పరిసర ప్రాంతాల అభివృద్ధితోపాటు అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలు మొదలగు పనులను 2022 డిసెంబరు నాటికి పూర్తి చేయాలని యునెస్కో సూచించింది. ప్రతిష్టాత్మకంగా భావించి సాధించుకున్న హోదాను నిలబెట్టుకోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రణాళిక బద్దమైన చర్యలు తీసుకోవాలి. నిర్ణీత గడువులోగా యునెస్కో విధించిన షరతులను, సౌకర్యాలను సమకూర్చడంపై దృష్టి పెట్టాలి. దీనిపై నిర్లక్ష్యం, ఏమరపాటు ఎంత మాత్రం మంచిది కాదు ? ఇది మన దేశ ప్రతిష్టకు సంబంధించిన అంశమని మర్చిపోకూడదు. గతంలో ప్రపంచంలోని కొన్ని చోట్ల వారసత్వ హోదా కట్టబెట్టినప్పటికీ, వాటి నిర్వహణ సక్రమంగా లేకపోయినా, ఆక్రమణలు, కూల్చివేతలు జరిగినా “యునెస్కో” తీవ్రంగా పరిగణించి హోదా రద్దు చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. వాటిని దృష్టిలో ఉంచుకుని అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా ఆలయ, సంరక్షణ, నిర్వహణ, మౌలిక సౌకర్యాల కల్పనలో చిత్తశుద్ధితో, ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలి. ప్రపంచ వారసత్వ హోదా దక్కి ఇప్పటికే మూడు నెలలు గడిచిపోతున్నాయి. మరోవైపు భక్తులు, పర్యాటకుల రద్దీ రోజురోజుకూ పెరిగిపోతోంది. మూడు నెలల్లో సుమారు మూడు లక్షల మందికి పైగా రామప్పను సందర్శించారని ఒక అంచనా.

- మేకిరి దామోదర్,

ఉపాధ్యక్షుడు, తెలంగాణ సామాజిక రచయితల సంఘం