- 11 మందిని చంపిన సీరియల్ కిల్లర్ సత్యనారాయణ అరెస్టు
- గుప్త నిధులు, మంత్రాల పేరుతో అమాయకులకు ఎర
- డబ్బు, స్థలాలు రాయించుకున్నాక కిరాతకంగా హత్యలు
- వివరాలు వెల్లడించిన గద్వాల డీఐజీ చౌహాన్
నాగర్ కర్నూల్, వెలుగు: మాయలు, మంత్రాలు, గుప్త నిధుల పేరుతో ఎర వేసి 11 మందిని హతమార్చిన సీరియల్ కిల్లర్ రామాటి సత్యనారాయణను పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం నాగర్ కర్నూల్ జిల్లా పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో నిందితుడిని మీడియాకు చూపించారు. కేసు వివరాలను జోగులాంబ గద్వాల డీఐజీ ఎల్ఎస్ చౌహాన్ వెల్లడించారు. ‘‘నిందితుడు సత్యనారాయణ.. తాంత్రిక పూజలతో గుప్త నిధులు సేకరిస్తానని నమ్మించేవాడు. డబ్బు, స్థలాలు రాయించుకున్నాక అతికిరాతకంగా చంపేవాడు.
ఇలా తెలంగాణ, ఏపీ, కర్నాటకలో 11 మందిని హతమార్చాడు. తెలంగాణలోని వనపర్తిలో నలుగురిని, నాగర్ కర్నూల్, కొల్లాపూర్, కల్వకుర్తిలో నలుగురిని, కర్నాటకలోని బలగనూరులో ఒకరిని, ఏపీలోని అనంతపురంలో ఒకరిని, హైదరాబాద్ కు చెందిన ఒకరిని చంపేశాడు. హైదరాబాద్‌లో హత్యకు గురైన వెంకటేశ్ భార్య ఫిర్యాదుతో విచారణ చేపట్టగా.. ఈ 11 హత్యలు బయటపడ్డాయి” అని వివరించారు. నిందితుడు సత్యనారాయణను కోర్టులో హాజరుపరిచి, తిరిగి పోలీస్ కస్టడీకి తీసుకుంటామని డీఐజీ చెప్పారు. తదుపరి విచారణలో మరిన్ని వివరాలు బయటపడే అవకాశం ఉందని తెలిపారు.
ఒత్తిడి చేస్తే మర్డరే
నాగర్‌కర్నూల్‌కు చెందిన రామాటి సత్యనారాయణ పూర్వీకులు నాటు వైద్యం చేసేవారు. ఆకు పసరు ఇవ్వడంతోపాటు దిష్టి మంత్రాలు వేసేవారు. వారి నుంచి పసరు తీయడాన్ని, మంత్రాలను సత్యనారాయణ నేర్చుకున్నాడు. కొన్నాళ్లు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశాడు. ఇలా చాలా మందితో పరిచయాలు పెంచుకున్నాడు. తనకు మాయలు, తాంత్రిక పూజలు వచ్చని, గుప్త నిధులు సేకరిస్తానని వారికి ఆశ చూపేవాడు. అయితే అందుకు బాగా ఖర్చవుతుందంటూ.. లక్షలకు లక్షలు తీసుకునేవాడు. కొందరి నుంచి ప్లాట్లు, పొలాలు తీసుకుని తన పేరిట రిజిస్టర్ చేయించుకున్నాడు.
గుప్త నిధుల విషయం కుటుంబ సభ్యులతోపాటు ఏ ఒక్కరికీ చెప్పకూడదని కండీషన్ పెట్టేవాడు. పూర్తిగా నమ్మిన వ్యక్తుల నుంచి డబ్బు, ఆస్తులు లాగేసేవాడు. ఎవరైనా డబ్బులు, స్థలాలు తిరిగివ్వాలని డిమాండ్‌చేస్తే.. గుప్తనిధులు వెలికి తీయడానికి గర్భిణులను బలివ్వాలని చెప్పి భయపెట్టి మభ్యపెట్టేవాడు. అప్పటికీ ఒత్తిడి చేస్తే పూజలు చేయాలంటూ నిర్మానుష్య ప్రదేశాలకు తీసుకెళ్లేవాడు. ముగ్గులు వేసి అందులో కూర్చోబెట్టి.. తీర్థం పేరుతో తనకు తెలిసిన విషపూరిత పసరు, తెల్ల జిల్లేడు, గన్నేరు కాయల రసం తాగించేవాడు. అవి తాగి స్పృహ కోల్పోయాక.. వారిని బండరాళ్లతో కొట్టి హతమార్చేవాడు. హత్యకు సంబంధించిన ఎలాంటి ఆనవాళ్లు లేకుండా చేసేవాడు.
మూడేండ్ల కింద ఒకే ఫ్యామిలీలో నలుగురు
సత్యనారాయణ 2020లో వనపర్తి జిల్లా నాగపూర్‌లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని చంపేశాడు. మరోవైపు కొల్లాపూర్‌కు చెందిన వెంకటేశ్.. తన కుటుంబంతో కలిసి హైదరాబాద్‌లో స్థిరపడ్డాడు. ఈ క్రమంలో సత్యనారాయణ అతనితో పరిచయం పెంచుకున్నాడు. వెంకటేశ్‌కి కూడా గుప్త నిధులు ఆశచూపి చివరికి చంపేశాడు. వెంకటేశ్ భార్య ఫిర్యాదుతో నాగర్‌కర్నూల్ ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ స్పెషల్ టీమ్ ఏర్పాటు చేసి విచారణ చేపట్టగా.. విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి.
డబ్బు ఆశతో సైకోగా మారిన సత్యనారాయణ.. చాలా తేలికగా హత్యలు చేసే స్థాయికి చేరాడని డీఐజీ ఎల్ఎస్ చౌహాన్ చెప్పారు. జనాల బలహీనతలు, ఆశను ఆసరాగా చేసుకుని.. వరుసగా హత్యలు చేసుకుంటూ పోయాడని తెలిపారు. సత్యనారాయణకు సహకరించిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. నిందితుడిపై గతంలో వచ్చిన ఫిర్యాదుల విషయంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తేలితే చర్యలు ఉంటాయని చెప్పారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో గుప్త నిధుల తవ్వకాల ముఠాపై నిఘా పెడతామని చెప్పారు. రాజకీయ నాయకుల ప్రమేయం ఉన్నా విడిచిపెట్టేది లేదన్నారు.
పసర్లు స్వాధీనం
హత్యకు గురైన వారి మొబైల్ ఫోన్స్, నిందితుడి సెల్ఫోన్లు,10 సిమ్ కార్డులు, కొన్ని రకాల చెట్ల ఆకుల పసర్లు, కారు, డిటోనేటర్లను స్వాధీనం చేసుకున్నట్లు డీఐజీ చౌహాన్ తెలిపారు. పసర్లను ల్యాబ్ టెస్టులకు పంపించామని చెప్పారు. ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ నేతృత్వంలో డీఎస్పీ మోహన్, సీఐ విష్ణు వర్ధన్ రెడ్డి, ఎస్‌ఐ మహేందర్ చాకచక్యంగా వ్యవహరించారని ప్రశంసించారు.