భద్రగిరిలో బ్రహ్మోత్సవాలు షురూ

  • గోవిందరాజుల ఆలయంలో పుట్టమన్ను సేకరణ
  •     రుత్విక్కులకు దీక్షా వస్త్రాలు అందజేత
  •     యాగశాలపై ఓంకార ధ్వజపటారోహణం

భద్రాచలం, వెలుగు: శ్రీరామదివ్యక్షేత్రం భద్రగిరిలో బుధవారం శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు షురూ అయ్యాయి.  తెలుగు సంవత్సరాది ఉగాదిని పురస్కరించుకుని సంప్రదాయబద్ధంగా వేడుకలు నిర్వహించారు. తెల్లవారుజామున ఆలయం తలుపులు తెరిచారు. సుప్రభాత సేవను చేసి మూలవరులకు ఉత్సవాంగ స్నపనం చేశారు. అభిషేకం, స్నపన తిరుమంజనం అయ్యాక ఉత్సవ అనుజ్ఞ తీసుకున్నారు. ఉగాది పచ్చడిని తయారు చేసి స్వామికి నివేదించాక భద్రుని మండపం వద్ద భక్తులకు పంపిణీ చేశారు. ఉత్సవమూర్తులను ఊరేగింపుగా చిత్రకూట మండపానికి తీసుకొచ్చారు. అక్కడ విశ్వక్షేన పూజ, పుణ్యాహవచనం, రక్షాసూత్రాల పూజ, రక్షాబంధనం నిర్వహించారు. బ్రహ్మోత్సవాలు, శ్రీరామాయణ మహాక్రతువులో పాల్గొనే రుత్విక్కులకు దీక్షా వస్త్రాలను ఏఈవో శ్రావణ్​ కుమార్​ చేతుల మీదుగా అందజేశారు. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు నుంచి వచ్చిన 108 మంది రుత్విక్కులు, బ్రహ్మోత్సవాలు నిర్వహించే ఆచార్య, బ్రహ్మ ఇతర వేదపండితులకు కూడా దీక్షా వస్త్రాలను బహూకరించారు. తర్వాత ఉత్సవమూర్తులను యాగశాలకు తీసుకెళ్లారు. ప్రత్యేక పూజలు చేశాక యాగశాలపై ఓంకార ధ్వజపటారోహణం వేదోక్తంగా జరిగింది. 

కల్పవృక్ష వాహనంపై రామయ్య

కల్పవృక్ష వాహనంపై రామయ్య తొలిసారిగా గోవిందరాజస్వామి ఆలయానికి వెళ్లారు. అక్కడ పుట్టమన్నును సేకరించి ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత చలువచప్పర వాహనంపై మూడు భాగాలుగా మట్టిని తీసుకొచ్చారు. దారిపొడవునా భక్తులు కల్పవృక్ష వాహనంపై ఉన్న స్వామిని దర్శించుకుని పులకించిపోయారు. మంగళహారతులు ఇచ్చారు. శ్రీరామ పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం కోసం ఆలయం కింద భాగంలో ఏర్పాటు చేసిన రెండు యాగశాలలకు రెండు భాగాల పుట్టమన్ను, గుడి పై భాగంలో బ్రహ్మోత్సవాలకు ఒక భాగం పుట్టమన్ను తీసుకెళ్లారు. ఈ మూడు యాగశాలల్లో పుట్టమన్ను వచ్చాక బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ వైభవంగా జరిగింది. 9 రోజుల పాటు శ్రీరామషడాక్షరి సంపుటితంగా, నారాయణాష్టక్షరీ మంత్రహోమ సమన్వితంగా యాగశాలల్లో నిర్వహించనున్నారు. 30వ తేదీన శ్రీరామనవమి సీతారాముల కల్యాణం, 31న శ్రీరామ పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం జరపనున్నారు.