గోకులరామంలో రామయ్యకు విలాసోత్సవం

భద్రాచలం, వెలుగు :  ఆంధ్రా విలీన ఎటపాక మండలం పురుషోత్తపట్నంలోని శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానం భూముల్లో ఉన్న వనవిహారం గోకులరామం మండపంలో గురువారం రామయ్యకు విలాసోత్సవం వైభవంగా జరిగింది. ఉదయం గోదావరి నుంచి తీర్థబిందెను తెచ్చి గర్భగుడిలో మూలవరులకు సుప్రభాత సేవను చేసి బాలబోగం నివేదించారు. 

కల్యాణమూర్తులను బేడా మండపానికి తీసుకెళ్లి నిత్య కల్యాణం చేశారు. తర్వాత రామయ్యను వేంకటేశ్వరస్వామి రూపంలో అలంకరించి కల్పవృక్ష వాహనంపై ఊరేగింపుగా వనవిహారానికి తీసుకెళ్లారు. మండపంలో స్వామికి విశ్వక్షేన పూజ, పుణ్యాహవచనం, ఆరాధన తర్వాత ప్రత్యేక హారతులు ఇచ్చారు. ఆలయానికి స్వామిని తీసుకొచ్చాక సాయంత్రం దర్బారు సేవ జరిపారు.

వైకుంఠ రామయ్యకు తిరువీధి సేవను నిర్వహించారు. ఆలయం నుంచి గోవిందరాజస్వామి సన్నిధికి తీసుకెళ్లి ప్రత్యేక పూజలు చేశారు.వేదికపై చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.