కొడుకును కనేందుకు బాలికతో రెండో పెండ్లి .. కాంట్రియాల తండాలో విచారణ చేపట్టిన అధికారులు

కొడుకును కనేందుకు బాలికతో రెండో పెండ్లి .. కాంట్రియాల తండాలో విచారణ చేపట్టిన అధికారులు

రామాయంపేట, వెలుగు: కొడుకును కనేందుకు బాలికను రెండో పెండ్లి చేసుకోగా.. ఇది కాస్త బయటకు తెలియడంతో అధికారులు వెళ్లి విచారణ చేపట్టారు. వివరాల్లోకి  వెళ్తే.. మెదక్ జిల్లా రామాయంపేట మండలం కాట్రియాల తండాకు చెందిన 35 ఏండ్ల వ్యక్తికి పెండ్లి అవగా ముగ్గురు ఆడపిల్లలు పుట్టారు. కొడుకును కనేందుకు  అదే మండలంలోని దంతేపల్లితండాకు చెందిన16 ఏండ్ల బాలికను పది రోజుల కింద రెండో పెండ్లి చేసుకున్నాడు. దీంతో స్థానికులు చైల్డ్ వెల్ఫేర్ 1098కి సమాచారం అందించారు. 

ఐసీడీఎస్ అధికారులతో పాటు రామాయంపేట ఎస్ఐ బాల్ రాజు, ఆర్ఐ గౌస్ శుక్రవారం తండాకు వెళ్లి విచారణ చేపట్టారు. బాలికను మెదక్ సఖీ సెంటర్ కు పంపించారు. ఘటనపై చైల్డ్ వెల్ఫేర్ కోర్టులో విచారణ చేయనున్నట్టు తెలిసింది. మైనర్ ను పెండ్లి చేసుకున్న ఘటనపై  రామాయంపేట సీడీపీఓ స్వరూపను వివరణ కోరగా విచారణ తర్వాత వివరాలు చెబుతామని చెప్పారు. అతనిపై  పోక్సో కేసు నమోదు కావచ్చని పేర్కొన్నారు.