న్యూఢిల్లీ: ‘రామాయణం: ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ’అనే చిత్రాన్ని ఫిబ్రవరి 15న పార్లమెంట్‌లో ప్రదర్శించనున్నారు. ఈ విషయాన్ని మూవీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ గీక్ పిక్చర్స్ ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించింది. 1993లో జపనీస్- ఇండియన్ సంయుక్తంగా ‘రామాయణం: ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ’అనే యానిమేషన్ చిత్రాన్ని రూపొందించింది. ఈ సినిమా చూసేందుకు స్పీకర్ ఓం బిర్లాతో పాటు పార్లమెంట్ సభ్యులు, పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు. 1993 నిర్వహించిన 24వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఐఎఫ్‌ఎఫ్‌ఐ)లో ఈ సినిమాను ప్రదర్శించారు. అయితే, అప్పట్లో థియేటర్లలో ఈ మూవీ రిలీజ్ కాలేదు.
కానీ, 2000 సంవత్సరంలో పలు టీవీ షోల్లో ఈ సినిమా రిలీజ్ అయి ప్రేక్షకులను ఆకట్టుకుంది. కాగా, జనవరి 24న 4కే ఫార్మాట్‌లో హిందీ, తమిళం, తెలుగుతో పాటు ఇంగ్లీష్‌లో విడుదలై ప్రేక్షకాదరణ పొందింది. ఈ సినిమాను ఏఏ ఫిల్మ్స్, ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్ డిస్ట్రిబ్యూట్ చేశాయి. యూగో సాకో, రామ్ మోహన్, కోయిచి ససాకి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు వి.విజేంద్ర ప్రసాద్ రైటర్‌గా పనిచేశారు. ‘‘పార్లమెంట్‌లో రామాయణం: ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ సినిమా ప్రదర్శనను మేము గౌరవంగా భావిస్తున్నాం. ఈ స్క్రీనింగ్ ప్రదర్శన మాత్రమే కాదు. ఇది మాకు స్ఫూర్తినిస్తుంది. మార్గదర్శకంగా కొనసాగుతుంది”అని గీక్ పిక్చర్స్ సహ వ్యవస్థాపకుడు అర్జున్ అగర్వాల్ పేర్కొన్నారు.