సింగరేణి పేరు మీద భూములు.. పట్టాలు ఇయ్యని సర్కార్

  •     హైకోర్టు తీర్పుతో రామయ్యపల్లి పరిహారం అవార్డు క్యాన్సిల్​ 
  •     తీర్పు వచ్చి ఏడాదైనా రైతులకు హ్యాండోవర్ ​కాని 708.16 ఎకరాలు 
  •     పట్టాలు లేకపోవడంతో రైతులకు రైతుబంధు, రైతు బీమా రావట్లే..
  •     భూములు అమ్మడానికి లేదు.. కొనడానికి లేదని రైతుల ఆవేదన 

పెద్దపల్లి, వెలుగు;పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం రామయ్యపల్లి(బుధారంపేట) గ్రామానికి చెందిన భూములు సింగరేణి పేరు మీద ఉండడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఆ భూములకు పట్టాలు ఇవ్వకపోవడంతో సర్కార్​ అందించే రైతుబంధు, రైతుబీమా.. వంటి  పథకాలను అందుకోలేకపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ అవసరాలకు భూములను అమ్ముకునే పరిస్థితి లేదని, బ్యాంకుల్లో పంట రుణాలు కూడా తీసుకునే అవకాశం లేదని రైతులు వాపోతున్నారు.   

ఊరును ఆగం చేసిండ్రు....

పెద్దపల్లి జిల్లా రామగిరి  మండలం ఆర్జీ3 డివిజన్​ పరిధిలో ఓసీపీ2ను విస్తరించడానికి సింగరేణి 2011లో రామయ్యపల్లి(బుధారంపేట)  రైతుల భూములను తీసుకునేందుకు నిర్ణయించింది. సర్వే చేసి 200  కుటుంబాలకు చెందిన 708.16 ఎకరాల భూమిని సేకరించింది. గ్రామస్తులతో ఎలాంటి చర్చలు జరపకుండానే భూములు స్వాధీనం చేసుకున్నట్లు అవార్డు పాస్​ చేశారు. ఎకరాకు రూ.1.75 లక్షలు, ఇతర పరిహారం కింద రూ.2.75 లక్షలు, మొత్తంగా రూ. 4.30లక్షలు ఇవ్వడానికి సంస్థ నిర్ణయించి, రూ.37 కోట్లు స్థానిక బ్యాంకులో డిపాజిట్​ చేసింది. అయితే తమకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలని, వ్యవసాయ భూములతో గ్రామాన్ని కూడా తీసుకొని ఆర్‌‌అండ్‌ఆర్​ ప్యాకేజీ ఇవ్వాలని గ్రామస్తులు డిమాండ్​ చేశారు. దానిపై సింగరేణి ఒప్పుకోకపోవడంతో 2017లో సింగరేణి ప్రకటించిన అవార్డుపై గ్రామస్తులు హైకోర్టులో కేసు వేశారు. గతేడాది హైకోర్టు అవార్డును క్యాన్సిల్ ​చేస్తూ తీర్పునిచ్చింది. అయినప్పటికీ ఇప్పటికి భూములు సింగరేణి స్వాధీనంలోనే ఉన్నాయి. 

అవార్డు క్యాన్సిల్​ అయినా పట్టాలిస్తలేరు

వ్యవసాయ భూములను సేకరించే టైంలో బుధారంపేట గ్రామాన్ని కూడా తీసుకుంటామని సింగరేణి యాజమాన్యం చెప్పిందని గ్రామస్తులు పేర్కొంటున్నారు. అందులో భాగంగానే గ్రామంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేయవద్దని సింగరేణి యాజమాన్యం అన్ని ప్రభుత్వ శాఖలకు సూచించింది. దీంతో ముందస్తుగా పంచాయతీకి చెందిన అన్ని రికార్డులను సీజ్​ చేశారు. 2017 ప్రభుత్వం నిర్వహించిన భూసర్వేలో గ్రామస్తుల పేరు మీద ఉన్న భూములను రెవెన్యూ రికార్డుల్లో సింగరేణి పేరు మీదకు మార్చేశారు. దీంతో ప్రభుత్వం నుంచి రావాల్సిన రైతుబంధు, రైతుబీమా.. వంటి బెన్​ఫిట్స్​ అందడం లేదు.  
భూసేకరణపై స్పష్టత రాకపోవడంతో కొంతమంది రైతులు ఆ భూములను సాగుచేసుకుంటున్నారు. మరోవైపు అవార్డు క్యాన్సిల్​అయినా ఆ భూములకు పట్టాలు లేకపోవడంతో బ్యాంకులు లోన్లు ఇస్తలేవు.  ఆ భూములను అమ్మాలన్నా, కొనాలన్నా కష్టంగా ఉందని రైతులు చెబుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో, పిల్లల చదువులకు, బిడ్డల పెండ్లిండ్లకు అమ్మాలన్నా వీలుకావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సింగరేణి తీసుకున్న భూములకు తమ పేరుమీద పట్టాలిచ్చి తమకు న్యాయం చేయాలని రైతులు డిమాండ్​ ​చేస్తున్నారు. 

సర్కార్​ బెన్​ఫిట్స్​ వస్తలేవు...

మాది  12 ఎకరాల భూమిని సింగరేణి  తీసుకుంది. ఎలాంటి పరిహారం ఇయ్యలే, అవార్డు క్యాన్సల్ అయినా పట్టాలిస్తలేరు. దీంతో మాకు సర్కార్​ నుంచి వచ్చే రైతుబంధు, రైతుబీమా వస్తలేదు. మాపేరు మీద భూములన్నీ సింగరేణి పేరుమీదకు పోయినయి. పాస్​బుక్కులు లేకపోవడంతో బ్యాంకులు లోన్లు ఇస్తలేవు. సర్కార్​ మాకు న్యాయం చేయాలే. 
–  మొగిలి నరేశ్‌​యాదవ్​, ఉప సర్పంచ్​,  బుధారంపేట, పెద్దపల్లి జిల్లా

మా భూములకు పట్టాలియ్యాలే

బుదారంపేట రైతుల భూములకు సింగరేణి ఇచ్చిన అవార్డును క్యాన్సిల్​ చేస్తున్నట్లు కోర్టు గతేడాది తీర్పు చెప్పింది. కానీ ఇప్పటి వరకు రైతుల భూములకు పట్టాలిస్తలేరు. దీంతో రైతులు అన్ని విధాలుగా నష్టపోతున్నరు. భూములు అమ్మాలన్నా, బ్యాంకుల నుంచి లోన్లు తీసుకోవాలన్నా కుదరడం లేదు. వెంటనే మా భూములకు పట్టాలియ్యాలే.
‌‌‌‌– ఆరెల్లి కొమురయ్యగౌడ్​, బుధారంపేట, పెద్దపల్లి జిల్లా