- రాహుల్ అసత్య ఆరోపణలు చేస్తున్నరు
ఖైరతాబాద్, వెలుగు: కాంగ్రెస్ మాజీచీఫ్ రాహుల్ గాంధీ పదేపదే ప్రధాని మోదీని విమర్శిస్తున్నారని, అది మంచి పద్ధతి కాదని కేంద్రమంత్రి ,రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు రాందాస్ అథవాలె అన్నారు. సోమావారం ప్రెస్‌క్లబ్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. " కేంద్రంలో మళ్లీ బీజేపీ వస్తే రిజర్వేషన్లు తీసేస్తారు..రాజ్యాంగాన్ని మారుస్తారంటూ అసత్య ఆరోపణలు చేయడం రాహుల్ మానుకోవాలి.
రిజర్వేషన్లు తీసేయడంకాదు... ఇంకా పెంచుతారు. రిజర్వేషన్లు తీసేస్తానంటే నేను చూస్తూ ఊరుకుంటానా? కేంద్ర ప్రభుత్వం సోలార్ విద్యుత్ ద్వారా 20 లక్షల మందికి లబ్ధి చేకూర్చింది. 4 కోట్ల ప్రజలకు మరుగు దొడ్ల సదుపాయం కల్పించింది. ప్రధాని ఆవాస్ యోజన ద్వారా 30 కోట్ల మందికి గృహాలు మంజూరయ్యాయి. 60 కోట్లమందికి 3 ఏండ్లుగా ఉచిత బియ్యం పంపిణీ అవుతున్నది.
జాతీయ రహదారులను అభివృద్ధి పరిచాం. రైల్వే కనెక్టివిటీని పెంచాం. మరోసారి అధికారంలోకి వస్తే మరింత అభివృద్ధి చేసి చూపిస్తం. తెలంగాణలోని ఎంపీ అభ్యర్థులతోపాటు ఏపీలో బీజేపీ మిత్రపక్షాల అభ్యర్థులను గెలిపించండి" అని రాందాస్ అథవాలె పేర్కొన్నారు. సమావేశంలో పార్టీ ఏపీ అధ్యక్షుడు కె.బ్రహ్మనందరెడ్డి తదితరులు పాల్గొన్నారు.