నేను సీఎం క్యాండిడేట్ కాదు.. అదంతా ఫేక్: కేజ్రీవాల్ వ్యాఖ్యలకు రమేష్ బిధూరి కౌంటర్

న్యూఢిల్లీ: ఢిల్లీ బీజేపీ సీఎం అభ్యర్థిగా రమేష్ బిధూరి పేరు ఖరారైందంటూ ఆప్ అధినేత కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలు దేశ రాజధానిలో కాకరేపాయి. ఈ క్రమంలో కేజ్రీవాల్ వ్యాఖ్యలపై రమేష్ బిధూరి స్పందించారు. ఈ మేరకు ఆదివారం (జనవరి 12) ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. తాను బీజేపీ సీఎం అభ్యర్థినంటూ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా  నిరాధారమైనవని, అవన్నీ ఊహాగానాలేనని కొట్టిపారేశారు. ముఖ్యమంత్రి పదవిపై తనకు ఎలాంటి వ్యక్తిగత ఆశ లేదని కేజ్రీవాల్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఓటమి భయంతో ఆప్ ఉద్దేశపూర్వకంగా తప్పుడు  ప్రచారం చేస్తోందని మండిపడ్డారు.

ALSO READ | ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ​29 మంది అభ్యర్థులతో బీజేపీ రెండో లిస్ట్

‘‘పార్టీ నాకు చాలా ఇచ్చింది. నాకు ఏ పదవిపై హక్కు లేదు. కేజ్రీవాల్ నన్ను ఉద్దేశించి నిరంతరం తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నాడు. నేను ఏ పదవికి పోటీదారుని కాదని నేను స్పష్టం చేయాలనుకుంటున్నాను. క్రమశిక్షణ గల పార్టీ కార్యకర్తగా పూర్తి అంకితభావంతో ప్రజలకు సేవ చేయడంపై దృష్టి పెట్టాను” అని లేఖలో పేర్కొన్నారు రమేష్ బిధూరి. ఇక తనను ముఖ్యమంత్రిగా పేర్కొనడం ద్వారా ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోందని ఆప్ పరోక్షంగా ఓటమి అంగీకరించిందని కౌంటర్ ఇచ్చారు. ఢిల్లీ ప్రజలు ఆప్ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని గుర్తించిన కేజ్రీవాల్ ముందుగానే తమ ఓటమిని అంగీకరించారని అన్నారు. 

ALSO READ | మీరు ఆ పని చేయండి.. వచ్చే ఎన్నికల్లో పోటీ చెయ్యను: బీజేపీకి కేజ్రీవాల్ ఛాలెంజ్

లిక్కర్ స్కామ్, ఎడ్యుకేషన్ స్కామ్, హెల్త్‌కేర్ స్కామ్, షీష్ మహల్ వివాదం, ధ్వంసమైన రోడ్లు, మురికి తాగునీటి సమస్యల నుంచి ఢిల్లీ ప్రజలు విముక్తి పొందాలనుకుంటున్నారన్నారు. కేజ్రీవాల్ నేతృత్వంలోని ప్రభుత్వం అవినీతితో పాటు పాలనలో అసమర్థతతో వ్యవహరిస్తోందని మండిపడ్డారు. నీరు, విద్యుత్, విద్య, ఆరోగ్య సంరక్షణకు ఇచ్చిన వాగ్ధానాలను నేరవేర్చడంలో ఆప్ సర్కార్ విఫలమైందని దుయ్యబట్టారు. 2025, ఫిబ్రవరి 5వ తేదీన ఢిల్లీలోని మొత్తం 70 అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 8న ఫలితాలు వెలువడనున్నాయి.