
- రమేష్ చందర్ దత్.. 1848 ఆగస్టు 13న
రమేష్ రాసిన కొన్ని చరిత్రాత్మక రచనలు చాలా ప్రసిద్ధి చెందాయి. ఇంగ్లీష్‌తోపాటు ఇతర భారతీయ భాషల్లోకి కూడా అనువాదం అయ్యాయి. 1886లో ఆయన ఋగ్వేదానికి సంపూర్ణ బెంగాలీ అనువాదాన్ని ప్రచురించాడు. ఆ గ్రంథం వల్ల స్వదేశీయుల నుంచే కాక యూరోపియన్ల నుంచి ప్రశంసలు అందుకున్నాడు.
కలకత్తాలో జన్మించాడు. 18వ శతాబ్దంలో బెంగాల్లో ఆధ్యాత్మిక భావనలు పెరిగాయి. సంస్కృత వాఙ్మయం, హిందూమతం, వేదాంతం పునరుద్ధరణ లాంటివి మొదలయ్యాయి. రాంమోహన్ రాయ్ ఉద్యమాల ప్రభావం సమాజం మీద చాలా ఉండేది. క్రిస్టియన్ మిషనరీలు, హిందూ విద్యాసంస్థలు ప్రారంభమయ్యాయి. బెంగాలీ కవిత్వం కొత్త ఊపిరి పోసుకుంది. ఈ పరిస్థితులు రమేష్ చందర్ జీవితాన్ని, ప్రవర్తనను ఎంతో మార్చాయి.
రమేష్ ముత్తాత నీలమణి దత్ కలకత్తాలో క్లైవ్, వారన్ హేస్టింగ్స్ కాలంలో ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్న వ్యక్తి. ఆయన వారసుల్లో చాలామంది సాహిత్య, విద్యాపరమైన విజయాలు ఎన్నో సాధించారు.
ప్రముఖ బెంగాల్ కవుల్లో ఒకరైన తోరు దత్ కూడా వీళ్ల కుటుంబానికి చెందినవారే. ఆ వారసత్వమే రమేష్‌ను రచయితగా మార్చింది. కవిత్వం, సాహిత్యం పట్ల ఆసక్తిని పెంచింది. బెంగాల్ డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేస్తున్న తండ్రి ఇసాన్ చందర్ దత్ 1861లో ఒక ప్రమాదంలో చనిపోయాడు. రెండేండ్ల ముందే తల్లి చనిపోయింది. దాంతో రమేష్, ఆయన సోదరుడి బాగోగులు వాళ్ల బంధువు సుశీ చందర్ దత్ చూసుకున్నాడు. ఆయన ఎన్నో గ్రంథాలు రాసిన పండితుడు. రమేష్ ఆలోచనలు, ఆదర్శాలపై సుశీ చందర్ ప్రభావం చాలా ఉంది.
రమేష్ 1868 మార్చిలో సివిల్ సర్వీసెస్ కోసం ఇంగ్లాండ్‌కు వెళ్ళాడు. ఆయనతోపాటే సురేంద్రనాథ్ బెనర్జీ, బిహారీ లాల్ గుప్తా కూడా బయలుదేరారు. ముగ్గురూ యూనివర్సిటీలో క్లాసులకు హాజరవుతూ, ప్రైవేటు చెప్పించుకుంటూ చాలా కష్టపడి చదివారు. చివరకు ఓపెన్ కాంపిటీటివ్ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. రమేష్‌కు 3వ స్థానం దక్కింది. ముగ్గురినీ బెంగాల్ సంస్థానానికి పంపించారు. ఇంగ్లాండ్‌లో ఉన్నప్పుడు రమేష్ బ్రిటిష్ ద్వీపాలు పర్యటించాడు. ఇండియాకు తిరిగి వస్తూ 1871లో తన మిత్రులతో కలిసి ఫ్రాన్స్, జర్మనీ, స్విట్జర్లాండ్, ఇటలీల్లో పర్యటించాడు. ఆ పర్యటనా విశేషాలతో ‘త్రీ ఇయర్స్ ఇన్ యూరోప్’ అనే పుస్తకం కూడా రాశాడు.
1871 నుంచి 1883 వరకు ఐసీఎస్ జూనియర్ ఆఫీసర్‌గా బెంగాల్లో పనిచేశాడు. 1874లో వచ్చిన కరువు సమయంలో ఆయన చేసిన మంచి పనులకు ఎన్నో ప్రశంసలు అందుకున్నాడు. ప్రజల ప్రయోజనాలను కాపాడే విషయంలో ఏనాడూ వెనకడుగు వేయలేదు. యూరోపియన్ నీలిమందు ఉత్పత్తిదారులు ఆయనను వ్యతిరేకించినా జంకలేదు. 1875 నాటికి రమేష్ మరో పుస్తకం ‘బెంగాల్ రైతు లోకం’ పేరుతో ప్రచురించాడు. అది సంస్థానంలోని అనేక సమస్యలను స్పృశించింది. 1883లో బేకర్ గంజ్ జిల్లా ఇన్చార్జిగా నియమితుడయ్యాడు.
అక్కడ రెండు సంవత్సరాలు పనిచేశాడు. భారతదేశం మొత్తం మీద ఒక జిల్లాకు అంతకాలం ఇన్చార్జిగా పనిచేసిన మొదటి భారతీయుడు ఆయనే. ఆ తర్వాత బర్ద్వార్, దినాజ్‌పూర్, మిడ్నపూర్లకు ఇన్చార్జిగా పనిచేసి ప్రజలతో ప్రేమపూర్వక సంబంధాలు ఏర్పరచుకున్నాడు. శాంతి, భద్రతలను సంరక్షించాడు. ఎన్నో వివాదాలను సామరస్యంగా పరిష్కరించాడు. ఆయన తరచూ కొన్ని గ్రామాలను కలిపి స్వపరిపాలనా సంస్థలను ఏర్పాటు చేస్తే బాగుంటుందని సూచన చేసేవాడు. ఆ ఆలోచనే ‘యూనియన్ పంచాయతీ’ల ఆవిర్భావానికి మూలమైంది.
1894లో రమేష్ డివిజనల్ కమిషనర్‌గా నియమితుడయ్యాడు. బ్రిటీష్ సర్వీస్‌లో ఆ పదవి పొందిన మొదటి వ్యక్తిగా రికార్డు సృష్టించాడు. ఆ తర్వాత 1895లో ఒరిస్సాకు బదిలీచేశారు. పూర్తి పెన్షన్ పొందటానికి అవసరమైన సర్వీస్ పూర్తి కాగానే 1897 అక్టోబర్‌లో ఇండియన్ సివిల్ సర్వీసెస్‌కు రాజీనామా చేశాడు. అప్పటినుంచి సాహిత్య కృషి చేశాడు. ఇంగ్లీష్‌తోపాటు తన మాతృభాష బెంగాలీలో ఎన్నో రచనలు చేశాడు.
ఉద్యోగ బాధ్యతల నుంచి తప్పుకున్నాక రమేష్ ఏడు సంవత్సరాలపాటు ఇంగ్లాండ్‌లోనే ఉన్నాడు. లండన్‌లోని ఒక కాలేజీలో హిస్టరీ లెక్చరర్‌గా చేరాడు. రాజకీయం వైపు వస్తే.. రమేష్‌కు 1899లో లక్నోలో జరిగిన 15వ జాతీయ కాంగ్రెస్ సెషన్‌కు అధ్యక్షత వహించే అత్యున్నత గౌరవం లభించింది. 1904లో ఆయన ఇండియాకు తిరిగి వచ్చి, బరోడా స్టేట్ సర్వీస్‌లో మొదటి రెవెన్యూ మినిస్టర్‌గా, తర్వాత దివాన్‌గా పనిచేశాడు. అక్కడ కూడా ఎన్నో సంస్కరణలకు పునాదులు వేశాడు. పరిశ్రమల అభివృద్ధికి కృషి చేశాడు.
1907లో ప్రభుత్వం ఇండియాలో వికేంద్రీకరణ కోసం రాయల్ కమిషన్‌ను నియమించింది. అందులో రమేష్ ఒక్కడే భారతీయ సభ్యుడు. ఆ తర్వాత సంవత్సరంపాటు ఇంగ్లాండ్‌లో ఉండి, రాజ్యాంగ సంస్కరణల విషయంలో మార్లేకు సహకరించాడు. 1909లో మళ్లీ ఇండియాకు వచ్చి బరోడా దివాన్‌గా చేరాడు. కానీ.. నిరంతరం పని, సేవ చేస్తుండడం వల్ల కొన్నాళ్లకు ఆయన ఆరోగ్యం క్షీణించసాగింది. జబ్బుచేసి 1909 నవంబర్ 30న తన భార్య, ఐదుగురు కూతుళ్లు, ఒక కొడుకుని విడిచి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు.
- మేకల మదన్మోహన్ రావుకవి, రచయిత