ట్రెండ్ : ఫొటోలతో ఏఐ వీడియో!

ట్రెండ్ : ఫొటోలతో ఏఐ వీడియో!

ఏఐలో రోజుకో కొత్త ఫీచర్​ అందుబాటులోకి వస్తోంది. కొన్ని మన పనులను సులభం చేస్తుంటే..  మరికొన్నింటిని మనల్ని ఎంటర్​టైన్ చేసేందుకు తీసుకొస్తున్నారు.. అలాంటి ఒక ఫీచర్​ని ఇప్పుడు క్యాలిఫోర్నియాకు చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్లాట్‌ఫామ్ క్యారెక్టర్​ ఏఐ తీసుకొచ్చింది. ఈ వీడియో జనరేషన్ మోడల్‌ని ‘అవతార్‌ ఎఫ్‌ఎక్స్‌’ అని పిలుస్తున్నారు. దీని ద్వారా 2డి, 3డి యానిమేటెడ్ వీడియోలను క్రియేట్​ చేయొచ్చు. ఇందులో కొత్తేముంది అంటారా... ఇది మనం ఇచ్చిన ఫొటోల సాయంతోనే యానిమేషన్​ క్యారెక్టర్లను డిజైన్​ చేస్తోంది.

అంటే ఫొటోలు అప్​లోడ్​ చేస్తే.. అది వాటితో ఒక వీడియో తయారుచేసి ఇస్తుంది. వీడియోలో ముఖం, చేతులు, శరీర కదలికలు స్పష్టంగా కనిపిస్తాయి. వీడియోల్లో క్యారెక్టర్లు మాట్లాడడానికి కావాల్సిన ఇన్​పుట్​ని టెక్స్ట్‌ రూపంలో ఇవ్వాల్సి ఉంటుంది. అది టెక్స్ట్​ టు స్పీచ్​ (టీటీఎస్​) టెక్నాలజీని ఉపయోగించి దాన్ని వాయిస్​గా మారుస్తుంది. మనుషుల ఫొటోలే కాదు.. కార్టూన్ బొమ్మలు ఇచ్చినా అది వీడియో రూపంలోకి మార్చి ఇస్తుంది. ముఖ కవళికలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తాయి. అయితే.. ఈ ఫీచర్​ని పెయిడ్​ సబ్‌స్క్రయిబర్లకు మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చింది.

మిగతా ఏఐ మోడల్స్​లా ఇది వీడియో జనరేషన్ కోసం టెక్స్ట్ ఇన్‌పుట్‌లను తీసుకోదు. కేవలం మోడల్ ఫొటోలను మాత్రమే ఇన్‌పుట్‌గా తీసుకుంటుంది. డీప్​ఫేక్​ లాంటి ఏఐ బేస్డ్‌ వీడియో జనరేషన్ మోడల్స్​ ద్వారా ఇదివరకు కొన్ని ఫేక్​ వీడియోలు క్రియేట్​ చేశారు. కానీ.. ఇందులో అది సాధ్యం కాదు. ఎందుకంటే మైనర్లు, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, ప్రముఖ వ్యక్తుల ఫొటోలను ఇస్తే వాటిని వెంటనే బ్లాక్​ చేస్తుంది. వీడియో జనరేట్​ చేయలేను అని చెప్పేస్తుంది. వీడియోల కోసం రాసే డైలాగ్‌లను చెక్​ చేసేందుకు ఇన్-బిల్ట్ సేఫ్టీ ఫిల్టర్లు ఉన్నాయి. అంటే అసభ్య కరమైన పదాలు రాస్తే వాయిస్​గా మార్చదు. వీడియో నిజమైనదా? ఏఐ ద్వారా క్రియేట్​ చేసినదా?  తెలుసుకునేందుకు వీలుగా ఇది ప్రతి వీడియోని వాటర్​మార్క్‌‌తో జనరేట్‌ చేస్తుంది. 

ఇప్పటికే కాంట్రవర్సీలో.. 

క్యారెక్టర్‌‌ ఏఐ ఆండ్రాయిడ్, ఐఫోన్లలో పనిచేస్తుంది. ఇది ఇప్పటికే చాలా ఫేమస్​ ఏఐ యాప్​. దీన్ని లైవ్ ఏఐ క్యారెక్టర్లతో చాట్‌ చేయటానికి రూపొందించారు.  మన ఇష్టాలను ఏఐకి చెప్తే.. అందుకు అనుగుణంగా ఒక ఏఐ క్యారెక్టర్​ని క్రియేట్​ చేస్తుంది. దాంతో మనం ఒక ఫ్రెండ్​లా మాట్లాడొచ్చు. ఈ మధ్యే కాలింగ్‌ ఫీచర్​ని కూడా తీసుకొచ్చింది. ఏఐకి ఎప్పుడంటే అప్పుడు కాల్​ చేయొచ్చు. మనతో మాట్లాడే గొంతును కూడా మనమే దాని లైబ్రరీ నుంచి సెలక్ట్‌ చేసుకోవచ్చు. ఈ యాప్‌ను ఎక్కువగా యువతే ఉపయోగిస్తోంది.