చొప్పదండి, వెలుగు : పబ్జీ గేమ్‌కు బానిస అయిన కొడుకుని ఆడొద్దని పేరెంట్స్ మందలించడంతో మనస్తాపంతో పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కరీంనగర్ జిల్లా చొప్పదండి ఎస్సై ఉపేంద్రచారి కథనం ప్రకారం.. మండలంలోని రుక్మాపూర్ కు చెందిన లంక అంజయ్యకు ఇద్దరు కొడుకులు, ఓ బిడ్డ ఉన్నారు. చిన్న కొడుకు లంక రమేశ్(19) మానకొండూర్ మండలం దేవంపల్లి సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఇంటర్ పూర్తి ఇటీవల బీటెక్ అడ్మిషన్ తీసుకున్నాడు. కాలేజీ ఇంకా ప్రారంభం కాకపోవడంతో ఇంటి దగ్గరే ఉంటున్నాడు.
రమేశ్ ఫోన్ లో తరచూ పబ్జీ ఆడుతూ దానికి బానిసయ్యాడు. ఎప్పుడూ ఫోన్లోనే గేమ్ఆడుతూ ఉండడం, ఏం పట్టించుకునే స్థితిలో లేకపోవడంతో పేరెంట్స్ ఆ గేమ్ ఆడొద్దని మందలించారు. దీంతో మనస్తాపం చెందిన రమేశ్ బుధవారం సాయంత్రం ఊరి శివారులోని సౌతు నూతి కుంట వద్ద గడ్డిమందు తాగాడు. వాంతులు చేసుకుంటుండగా గ్రామస్తులు కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ రాత్రి చనిపోయాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు గురువారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.