సూర్యాపేట, వెలుగు: ఆలిండియా ఫార్వార్డ్ బ్లాక్ నుంచి పోటీ చేస్తానని సూర్యాపేటకు చెందిన కాంగ్రెస్ నేత పటేల్ రమేశ్ రెడ్డి ప్రకటించారు. చివరి వరకు కాంగ్రెస్ టికెట్ తనకే వస్తుందని రమేశ్ రెడ్డి ఆశించారు. గురువారం నామినేషన్ కూడా వేశారు. అయితే అనూహ్య పరిణామాల మధ్య దామోదర్ రెడ్డికి కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది. ఈ విషయం తెలిసి రమేశ్ రెడ్డి, ఆయన కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. పార్టీ తనను మోసం చేసిందని రమేశ్ రెడ్డి వాపోయారు.
ఎన్నికల బరిలో ఉంటానని చెప్పారు. మొదట ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని ప్రకటించి, తర్వాత ఆలిండియా ఫార్వార్డ్ బ్లాక్ నుంచి బరిలోకి దిగనున్నట్టు తెలిపారు. శుక్రవారం పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి మరో సెట్ నామినేషన్ దాఖలు చేశారు. సూర్యాపేట ప్రజల మద్దతు తనకే ఉందని, తప్పకుండా గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా రమేశ్ రెడ్డి మద్దతు కోసం ఆయన ఇంటికి వెళ్లాలని దామోదర్ రెడ్డి నిర్ణయించుకున్నారని, ఆ విషయం తెలిసి రమేశ్ రెడ్డి ఇంటి నుంచి బయటకు వెళ్లారని తెలిసింది. కాగా, టికెట్ దక్కలేదని రమేశ్ రెడ్డి వర్గీయులు గురువారం అర్ధరాత్రి సూర్యాపేట వద్ద హైదరాబాద్–విజయవాడ హైవేపై రాస్తారోకో చేశారు.