అల్లు అర్జున్కు మళ్లీ నోటీసులు.. చెప్పి వెళ్లాలంటూ పోలీసుల ఆదేశం

అల్లు అర్జున్కు మళ్లీ నోటీసులు.. చెప్పి వెళ్లాలంటూ పోలీసుల ఆదేశం

అల్లు అర్జున్ కు వరుసగా నోటీసులు ఇస్తున్నారు పోలీసులు. శ్రీతేజ్ ను పరామర్శించేందుకు కిమ్స్ హాస్పిటల్ కు వెళ్లాలనే యోచనలో ఉన్న అల్లు అర్జున్ కు మరోసారి సోమవారం (6 జనవరి 2025) నోటీసులు ఇచ్చారు రాంగోపాల్ పేట పోలీసులు.  కిమ్స్ కు వెళ్తే భద్రతాపరమైన ఇబ్బందులు వస్తాయని, ఒకవేళ వెళ్లాలనుకుంటే ముందస్తుగా తమకు సమాచారం ఇచ్చి అనుమతి తీసుకోవాలని సూచించారు. 

ఒకవేళ అల్లు అర్జున్ కిమ్స్ ఆస్పత్రికి రావలనుకుంటే.. వచ్చే విషయం రహస్యంగా ఉండాలని నోటీసులలో తెలిపారు.  ముందస్తు సమాచారం ఇస్తే తగిన భద్రతాపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. 

ఇంతకు ముందు ఆదివారం (5 జనవరి 2025)  అల్లు అర్జున్ ఇంటికి పోలీసులు  వెళ్లి నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ నోటీసులలో కిమ్స్ లో శ్రీతేజ్ ను పరామర్శించేందుకు అల్లు అర్జున్ రావద్దని పేర్కొన్నారు. ఒక వేళవస్తే అక్కడ జరిగే పరిణామాలకు బాధ్యత వహించాలని హెచ్చరించారు.

అయితే సంధ్య థియేటర్ ఘటనలో రేవతి చనిపోవడం, తీవ్రంగా గాయపడిని శ్రీతేజ్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటి వరకు చికిత్స పొందుతున్న బాలుడిని పరామర్శించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో శ్రీతేజ్ ను పరామర్శిస్తానని అల్లు అర్జున్ ప్రకటించారు. 

ALSO READ | PawanKalyan: గేమ్ ఛేంజర్ ఈవెంట్‌ విషాదం.. మృతులకు పవన్‌ కల్యాణ్‌ ఆర్థికసాయం

అల్లు అర్జున్ కిమ్స్ ఆస్పత్రికి వస్తే భద్రతా సమస్యలు తలెత్తుతాయని, భారీ ఎత్తున జనం చేరుకునే అవకాశం ఉందని, కంట్రోల్ చేయడం ఇబ్బందిగా మారి ఏదైనా అవాంఛనీయ ఘటన జరగవచ్చునని పోలీసులు చెబుతున్నారు. 

తాజాగా నోటీసులు ఇచ్చిన మరుసటి రోజే సోమవారం మరోసారి నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశం అయ్యింది. ఆదివారం కిమ్స్ కు వెళ్లేది లేదని నోటీసులు ఇచ్చి న రాంగోపాల్ పేట పోలీసులు.. సోమవారం నోటీసుల్లో కిమ్స్ కు వెళ్లే ముందు అనుమతి తప్పని సరి అని చెప్పడం గమనార్హం.