ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై వివాదస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మపై ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన విషయం తెలిసిందే. టీడీపీ నేత ఫిర్యాదు మేరకు ఆర్జీవీపై కేసు ఫైల్ చేసిన ఒంగోలు పోలీసులు.. విచారణకు హాజరు కావాలంటూ ఆయనకు రెండు సార్లు నోటీసులు జారీ చేశారు. రెండు సార్లు పోలీసుల విచారణకు రాంగోపాల్ వర్మ డుమ్మా కొట్టారు. దీంతో 2024, నవంబర్ 25వ తేదీన ఆర్జీవీని అదుపులోకి తీసుకునేందుకు ఒంగోలు పోలీసులు హైదరాబాద్లోని దర్శకుడు నివాసానికి వచ్చారు.
రాంగోపాల్ వర్మ ఇంట్లో లేకపోవడంతో అతడి కోసం గాలిస్తున్నారు. రాంగోపాల్ వర్మను పోలీసులు ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పోలీసుల తీరుపై ఆర్జీవీ న్యాయవాది బాలయ్య అసహనం వ్యక్తం చేశారు. ‘‘రామ్ గోపాల్ వర్మకు పోలీసులు రెండు సార్లు నోటీసులు ఇచ్చారు. రెండు నోటీసులకు తాము ఆన్సర్ ఇచ్చాం.
సినిమా షెడ్యూల్ షూట్స్ ఉండడం వల్ల విచారణకు హాజరుకావడం లేదు. డిజిటల్ విచారణకు సిద్ధంగా ఉన్నట్లు ఇప్పటికే స్పష్టం చేశాం.. ఈ విషయాన్ని డీఎస్పీకి వాట్సాప్ ద్వారా తెలియజేశాం. అయినా పోలీసులు ఇంటి వరకు రావడం కరెక్ట్ కాదు’’ అని అన్నారు. ఈ కేసులో ఆర్జీవీ దాఖలు చేసిన ముందస్తు బెయిల్, క్వాష్ పిటిషన్లు హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నాయని గుర్తు చేశారు. కేసు విచారణలో పోలీసులకు పూర్తిస్థాయిలో సహకరిస్తామని తెలిపారు.