PAK vs BAN 2024: భారత జట్టు కారణంగానే పాకిస్థాన్‌ క్రికెట్ దిగజారింది: రమీజ్ రాజా

రావల్పిండి వేదికగా స్వదేశంలో జరిగిన తొలి టెస్టులో పాకిస్థాన్ జట్టు బంగ్లాదేశ్ పై చిత్తుగా ఓడిపోవడంతో ప్రస్తుతం ఆ జట్టుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తొలి ఇన్నింగ్స్ లో ఇన్నింగ్స్ డిక్లేర్ చేసి కూడా జట్టు అనూహ్యంగా ఓడిపోవడంతో ఆ దేశ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. పాకిస్థాన్ చిన్న జట్ల మీద ఓడిపోవడం ఇటీవలే అలవాటుగా మారిపోయింది. ఆ జట్టు 2023 వన్డే వరల్డ్ కప్ లో ఆఫ్ఘనిస్థాన్ పై.. 2024 టీ20 వరల్డ్ కప్ లో అమెరికా జట్లపై ఓడిపోయి నాకౌట్ కు చేరలేకపోయింది. తాజాగా బంగ్లాదేశ్ పై తొలి టెస్ట్ ఓటమి ఆ జట్టును మరింతగా కృంగదీసింది. 

పాకిస్థాన్ ను బంగ్లాదేశ్ చిత్తుగా ఓడించడంతో ఆ దేశ మాజీ క్రికెటర్ రమీజ్ రాజా తమ ఓటములకు టీమిండియా కారణమని వితండ వాదన చేశాడు. 2023లో జరిగిన ఆసియా కప్‌లో భారత బ్యాటర్లు తమను చిత్తు చేయడంతో పాకిస్థాన్ సమస్యలు మొదలయ్యాయని రమీజ్ అభిప్రాయపడ్డాడు. ఈ మ్యాచ్ లో పాక్ పేసర్లను భారత బ్యాటర్లపై పూర్తి ఆధిపత్యం చూపించారని.. అప్పటి నుంచి పాక్ పేసర్లు లయ కోల్పోయారని ఆయన అన్నాడు. జట్టు ఎంపికలో పొరపాటు జరిగిందని.. పాక్ ఈ మ్యాచ్ లో స్పిన్నర్ లేకుండా ఆడడం పాక్ పరాజయానికి కారణమైందని తెలిపాడు. 

ఈ మ్యాచ్ విషయానికి వస్తే తొలి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌ను  పాక్‌‌‌‌‌‌‌‌ 448/6  స్కోరు వద్ద డిక్లేర్ చేయగా.. బంగ్లా 565 రన్స్‌‌కు ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్ లో పాక్ 146 పరుగులకు ఆలౌట్ కాగా.. 30 పరుగుల స్వల్ప టార్గెట్ ను వికెట్ కోల్పోకుండా చేసి 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. భారీ సెంచరీ చేసిన  ముష్ఫికర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌‌‌‌‌‌‌‌ అవార్డు లభించింది. రెండు టెస్టుల సిరీస్‌‌‌‌‌‌‌‌లో బంగ్లా 1–0తో ఆధిక్యంలో నిలిచింది. రెండో మ్యాచ్ రావల్పిండి వేదికపైనే ఆగస్టు 30 నుంచి జరుగుతుంది.