
నిర్మల్, వెలుగు: జల్.. జంగల్.. జమీన్ కోసం బ్రిటిష్ పాలకులతో, నిజాం సైన్యంతో పోరాడి అసువులుబాసిన రాంజీ గోండ్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం రాంజీ గోండ్ వర్ధంతి వేడుకలను నిర్మల్ లో ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ఆయన ఫొటోకు, చైన్ గేట్ వద్ద ఉన్న విగ్రహానికి మహేశ్వర్ రెడ్డి పూలదండలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మొదటి స్వాతంత్ర్య సంగ్రామాన్ని నిర్మల్ కేంద్రంగా నడిపిన గొప్ప పోరాట యోధుడు రాంజీ గోండ్ అని కొనియాడారు. ఆయన పోరాట పటిమ ప్రతిఒక్కరికి స్ఫూర్తిదాయకమన్నారు.
తుడుందెబ్బ ఆధ్వర్యంలో..
రాంజీ గోండ్ వర్ధంతిని తుడుందెబ్బ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కురన్నపేట వద్ద ఉన్న వేయి ఉరుల మర్రి ప్రదేశంలోని రాంజీ గోండ్ స్మారక స్థూపానికి నేతలు నివాళులర్పించారు. తుడుందెబ్బ రాష్ట్ర నేత వెంకగారి భూమయ్య మాట్లాడుతూ.. నిర్మల్ లో రాంజీ గోండ్ స్మారక మ్యూజియాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మ్యూజియం ఏర్పాటు చేస్తామని గతంలో పలువురు మంత్రులు హామీ ఇచ్చి మాట తప్పారన్నారు.
జిల్లా కేంద్రంలో ఆదివాసీల కోసం మినీ ఐటీడీఏను ఏర్పాటు చేయాలని కోరారు. రాంజీ గోండ్ వర్ధంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలన్నారు. ఆదివాసీ పోరాటయోధుల చరిత్రను భావితరాలకు అందించేలా పుస్తకాలు ముద్రించాలని కోరారు. మహారాష్ట్ర నుంచి వలస వచ్చిన లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలన్నారు. బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మల్లారెడ్డి, తుడుందెబ్బ జిల్లా కార్యదర్శి మంద మల్లేశ్, ఉపాధ్యక్షుడు శ్రీని వాస్, తొడుసం గోవర్ధన్, భీమ్ రావు, శంకర్, భోజన్న
పాల్గొన్నారు.
అధికారికంగా నిర్వహించాలె
తిర్యాణి, వెలుగు: రాంజీ గోండ్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆసిఫాబాద్ జిల్లా ఆదివాసీ ఉద్యోగ అధ్యక్షుడు కోట్నక ప్రవీణ్ అన్నారు. రాంజీ గోండ్165 వర్ధంతిని పురస్కరించుకొని తిర్యాణి మండలంలోని చింతపల్లి రాంజీ గోండ్ చౌక్‌లో జెండా ఆవిష్కరించి ఆయన పొటోలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రాంజీ గోండ్ వర్ధంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు.
ఆయన చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్పించాలన్నారు. మాజీ జడ్పీటీసీ అత్రం చంద్రశేఖర్, మాజీ సర్పంచ్ రుక్మిణి, ఆదివాసీ ఉద్యోగ సంఘాల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గెడం జనార్ధన్, తుడుం దెబ్బ జిల్లా ఉపాధ్యక్షుడు వెడ్మ భగవంతురావు, ప్రధాన కార్యదర్శి సుభాష్, ఆదివాసీ విద్య సంఘం నేత మర్సుకోల అశోక్, గిరిజన సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.