ఫిల్మ్ సిటీలో అధికారిక లాంఛనాలతో రామోజీరావు అంత్యక్రియలు

ఫిల్మ్ సిటీలో అధికారిక లాంఛనాలతో రామోజీరావు అంత్యక్రియలు

హైదరాబాద్, వెలుగు : ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ చెరుకూరి రామోజీరావు (88) కన్నుమూశారు. అనారోగ్యంతో ఆయన తుదిశ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న రామోజీరావును ఈ నెల 5న కుటుంబసభ్యులు హైదరాబాద్ నానక్​రామ్ గూడలోని స్టార్‌‌ ‌‌హాస్పిటల్​లో చేర్పించారు. ఆయనకు సీరియస్​గా ఉండడంతో డాక్టర్లు వెంటిలేటర్ మీద ఉంచి ట్రీట్​మెంట్ అందించారు. అయితే ఆరోగ్యం విషమించి శనివారం తెల్లవారుజామున 4:50 గంటలకు తుదిశ్వాస విడిచారు.

అనంతరం రామోజీరావు పార్థివదేహాన్ని రామోజీ ఫిల్మ్ సిటీకి తరలించారు. శనివారమే అంత్యక్రియలు జరగాల్సి ఉండగా, రామోజీరావు మనుమడు (సుమన్ కొడుకు) ఆస్ర్టేలియా నుంచి వస్తుండడంతో ఆదివారం నిర్వహించనున్నారు. శనివారం రాత్రి ఆయన హైదరాబాద్ చేరుకున్నారు. కాగా, రామోజీరావు చిన్న కుమారుడు సుమన్ లుకేమియాతో 2012 సెప్టెంబర్ 7న మరణించారు. 

ఏపీలో రెండ్రోజులు సంతాప దినాలు.. 

రామోజీరావు అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన శనివారం సీఎస్ శాంతికుమారి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక, సైబరాబాద్ సీపీ అవినాశ్ మహంతికి ఈ మేరకు ఆదేశాలిచ్చారు. రామోజీరావు అంత్యక్రియలు ఆదివారం ఉదయం రామోజీ ఫిల్మ్ సిటీలో అధికారిక లాంఛనాలతో జరగనున్నాయి. ఆయన చిన్న కుమారుడు సుమన్ అంత్యక్రియలు జరిగిన చోట స్మారక వనంలో నిర్వహించనున్నారు. అంత్యక్రియల ఏర్పాట్లపై రంగారెడ్డి కలెక్టర్, పోలీసు ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడారు. కాగా, రామోజీరావుతో మృతితో తెలుగు సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ఏపీ ప్రభుత్వం ఆది, సోమవారం సంతాప దినాలుగా ప్రకటించింది. ఆదివారం షూటింగ్స్ బంద్ చేస్తున్నట్టు తెలుగు నిర్మాతల కౌన్సిల్ తెలిపింది. 

సేవలకు గుర్తింపుగా పద్మవిభూషణ్.. 

కృష్ణా జిల్లా పెదపారుపూడిలో 1936 నవంబర్ 16న రైతు కుటుంబంలో రామోజీరావు జన్మించారు. తల్లి సుబ్బమ్మ, తండ్రి వెంకట సుబ్బారావు. మీడియా, వ్యాపార, సినీ రంగాల్లో రామోజీరావు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మార్గదర్శి చిట్ ఫండ్, ఈనాడు వార్తాపత్రిక, ఈటీవీ నెట్‌‌‌‌వర్క్, రమాదేవి పబ్లిక్ స్కూల్, ప్రియా ఫుడ్స్, కళాంజలి, ఉషాకిరణ్ మూవీస్‌‌‌‌, డాల్ఫిన్ గ్రూప్ హోటల్స్ ను నెలకొల్పారు. హైదరాబాద్ సమీపంలో రామోజీ ఫిల్మ్ సిటీ నిర్మించారు. 1974లో విశాఖ కేంద్రంగా ఈనాడు పేపర్ ను స్ధాపించారు. పత్రికా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. 1995లో ఈటీవీ చానెల్ ను ప్రారంభించి ఈటీవీ ప్లస్, ఈటీవీ సినిమా, ఈటీవీ అభిరుచి, ఈటీవీ లైఫ్, ఈటీవీ బాల భారత్ చానెల్స్ గా విస్తరించారు. ఈటీవీ విన్ పేరుతో ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ను కూడా నెలకొల్పారు. 1983లో ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్​ను ప్రారంభించి తెలుగు, కన్నడ, హిందీ, మరాఠీ తదితర భాషల్లో 87 చిత్రాలు నిర్మించారు. కాగా, రామోజీరావు సేవలకు గుర్తింపుగా 2016లో కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషణ్ పురస్కారం అందజేసింది. 

ప్రముఖుల నివాళి..  

 రామోజీరావు మృతిపై మీడియా, సినీ, రాజకీయ ప్రముఖులు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, గవర్నర్ సీపీ రాధాకృష్ణన్, కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, రాజ్ నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్, పశ్చిమ బెంగాల్, కేరళ, మహారాష్ట్ర సీఎంలు మమతా బెనర్జీ, పినరయి విజయన్, ఏక్ నాథ్ షిండే, మాజీ సీఎం కేసీఆర్, ఎంపీ బండి సంజయ్, సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ఆ పార్టీ జాతీయ నేత నారాయణ, వైసీపీ చీఫ్​వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల, సూపర్ స్టార్ రజినీకాంత్ తదితరులు సంతాపం తెలిపారు. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ,  డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు, కాంగ్రెస్ నేత జానారెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, సినీ నటుడు చిరంజీవి, సినీ డైరెక్టర్ రాజమౌళి తదితరులు రామోజీరావు పార్థివదేహానికి నివాళులర్పించారు. 

అసామాన్య విజయాలు సాధించారు.. 

రామోజీరావు మరణం తీవ్ర ఆవేదనకు గురిచేసింది. ఆయన ఒక సామాన్య కుటుంబంలో పుట్టి, అసామాన్య విజయాలు సాధించారు. తెలుగు రాష్ట్రాలకు, దేశానికి అనేక సేవలు అందించారు. అనారోగ్యానికి గురైన రామోజీ.. తిరిగి కోలుకుంటారని భావించాం. కానీ ఇలాంటి వార్త వినాల్సి వస్తుందని అనుకోలేదు. 

- చంద్రబాబు నాయుడు, టీడీపీ చీఫ్

రామోజీ మరణం దేశానికి తీరని లోటు

రామోజీరావు మృతి దేశానికి తీరని లోటు. దేశంలో పత్రిక, ప్రసార రంగాలు ప్రతిపక్ష పాత్ర పోషిస్తాయని నిరూపించిన వ్యక్తి రామోజీరావు. ఆయన ఆ వ్యవస్థల ద్వారా సమస్యలను లేవనెత్తి పాలకుల నుంచి ప్రజలకు మేలు జరిగేలా పోరాటం చేశారు. దేశ పత్రికా రంగంలో రామోజీ చేసిన సేవలు చిరస్మరణీయం. అలాగే వ్యాపారంలో, ప్రజాసేవలో తన మార్క్ ను చాటుకున్నారు. రామోజీ కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. ఆ కుటుంబానికి కాంగ్రెస్ అండగా ఉంటుంది. 

సీఎం రేవంత్

మీడియా రూపురేఖలు మార్చేశారు.. 

రామోజీరావు మరణం విచారకరం. మీడియా, సినీ రంగానికి ఆయన అందించిన సేవలు మరువలేనివి. రామోజీ మీడియా రుపురేఖలను మార్చేశారు. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. 

- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ మాజీ చీఫ్ 

ఆవిష్కరణలకు ఆద్యుడు..  

భారతీయ మీడియాను విప్లవాత్మకంగా మార్చిన దార్శనికుడు రామోజీరావు. ఆయన జర్నలిజం, సినిమా ప్రపంచంలో చెరగని ముద్ర వేశారు. రామోజీ అవిశ్రాంత ప్రయత్నాలతో మీడియా, వినోద ప్రపంచంలో ఎన్నో ఆవిష్కరణలు, కొత్త ప్రమాణాలు నెలకొల్పారు.

 - ప్రధాని మోదీ 

టైకూన్​ను కోల్పోయాం.. 

రామోజీరావు మృతితో మీడియా, సినీరంగం ఓ టైకూన్ ను కోల్పోయింది. వార్తా పత్రిక, న్యూస్ చానెల్, ఫిల్మ్ సిటీ.. ఇలా ఎన్నో వ్యాపారాలను ప్రారంభించి లక్షలాది మందికి ఉపాధి కల్పించారు. ఆయన కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. 

- రాష్ట్రపతి ద్రౌపది ముర్ము