
- ఇష్టానుసారంగా చెట్ల నరికివేత
- బోనాల్ శివారులో వంద ఎకరాలు ఆక్రమణ
- పట్టించుకోని ఫారెస్ట్ అధికారులు
లింగంపేట, వెలుగు : ఒకవైపు ప్రభుత్వాలు అడవుల శాతాన్ని పెంచాలన్న సంకల్పంతో రూ.కోట్లు ఖర్చు చేసి మొక్కలు నాటుతుంటే కొందరు ఇష్టానుసారంగా చెట్లను నరికి కబ్జాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి వారిని అడ్డుకోవాల్సిన ఫారెస్ట్ ఆఫీసర్లు అందినకాడికి దండుకుని తమకేమీ పట్టదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.
కామారెడ్డి జిల్లాలో 82.130 హెక్టార్ల విస్తీర్ణంలో అడవులు విస్తరించి ఉన్నాయి. లింగంపేట, గాంధారి, మాచారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, పిట్లం, నిజాంసాగర్, నాగిరెడ్డిపేట, తాడ్వాయి తదితర మండలాల్లో దట్టమైన అడవులు ఉన్నాయి.
లింగంపేట మండలంలోని బోనాల్, శెట్పల్లి, పర్మల్ల, మెంగారం, ముస్తాపూర్, ఒంటర్పల్లి, బానాపూర్, కంచ్ మల్, కొండాపూర్, భవానీపేట, మోతె, నల్ల మడుగు, ముంబాజీపేట, పోల్కంపేట, కన్నాపూర్, రామాయిపల్లి గ్రామాల శివార్లలో అడవులను యధేచ్ఛగా నరికేస్తున్నారు. బోనాల్ శివారులోని అడవిలో సుమారు వంద ఎకరాల్లో చెట్లను నరికివేశారు. గ్రామానికి చెందిన కొందరు సాగు భూములుగా మార్చుకునేందుకు ఈ చర్యలకు పాల్పడుతున్నారు. మెంగారం - బోనాల్ ప్రధాన రహదారికి ఇరువైపులా చెట్ల నరికివేత కొనసాగుతోంది.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం సాగులో ఉన్న అటవీ భూములకు హక్కుపట్టాలు ఇవ్వడంతో లింగంపేట మండలంలో అడవుల నరికివేతలు ఎక్కువయ్యాయి. వనాలు లేకపోతే వర్షాలు వచ్చేది కష్టమేనని జిల్లావాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటవీ భూముల్లో లక్షల విలువ గల టేకు చెట్లను నరికి వేస్తున్నారు. పెద్దపెద్ద దుంగలను అక్రమంగా విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అటవీ శాఖ ఆఫీసర్లు మామూళ్లు తీసుకుని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. వంద ఎకరాలు కబ్జాకు గురైనా ఎందుకు స్పందించడంలేదని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు.
పీవోఆర్ లతో సరిపెడుతున్న సిబ్బంది..
అటవీ భూముల కబ్జాలకు పాల్పడే వ్యక్తులపై చర్యలు తీసుకోవాల్సిన ఫారెస్టు ఆఫీసర్లు కేవలం ప్రైమరీ అపెన్సురిపోర్టు(పీవోఆర్)లతో సరిపెడుతున్నారు. అటవీ నేరాలకు పాల్పడిన వ్యక్తులపై ముందుగా పీవోఆర్ నమోదు చేస్తారు. తదుపరి చార్జిషీట్ తయారు చేసి కోర్టులో దాఖలు చేస్తే శిక్షలు విధిస్తారు. కానీ ఎల్లారెడ్డి ఫారెస్టు రేంజ్ పరిధిలో అటవీ ఆఫీసర్లు పీవోఆర్లతోనే సరిపెడుతుండడం విశేషం.
కేసులు నమోదు చేస్తాం..
అడవులు నరుకుతున్న వ్యక్తులపై కేసులు నమోదు చేస్తాం. లింగంపేట మండలం బోనాల్ అటవీ ప్రాంతంలో సుమారు వంద ఎకరాల్లో చెట్లను నరికినవారిపై చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే ఆరుగురిపై కేసు పెట్టాం. త్వరలోనే చార్జిషీట్ దాఖలు చేస్తాం. ఓంకార్ ఎఫ్ఆర్వో ఎల్లారెడ్డి