
హనుమకొండ, వెలుగు: వరంగల్ నగరంలోని డంపింగ్‌యార్డును అక్కడి నుంచి ఎత్తివేసి తమ ప్రాణాలకు కాపాడాలని మడికొండ, రాంపూర్ గ్రామాల ప్రజలు సీఎం ప్రజావాణిలో విజ్ఞప్తి చేశారు. మడికొండ, రాంపూర్ గ్రామాల ప్రజలు మంగళవారం హైదరాబాద్ ప్రజాభవన్ కు వెళ్లారు. అక్కడ స్టేట్ ప్లానింగ్కమిషన్వైస్చైర్మన్, సీఎం ప్రజావాణి ఇన్ చార్జి చిన్నారెడ్డికి డంప్‌యార్డు సమస్యపై వినతిపత్రం అందించారు. మడికొండ డంపింగ్ యార్డు వల్ల చుట్టుపక్కల గ్రామాల ప్రజలు నరకం చూడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
డంప్‌యార్డును తరలించి, తమకు న్యాయం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. స్పందించిన చిన్నారెడ్డి వెంటనే హనుమకొండ కలెక్టర్, గ్రేటర్ కమిషనర్ తో ఫోన్ లో మాట్లాడారు. దీంతో డంప్ యార్డు తరలించేందుకు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా సూచించారు. తగిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్, గ్రేటర్ కమిషనర్ వివరణ ఇచ్చినట్లు బాధితులు తెలిపారు. కార్యక్రమంలో మడికొండ, రాంపూర్ గ్రామస్తులు తౌటిరెడ్డి కరుణాకర్‌రెడ్డి, దువ్వ నవీన్, కిషన్, మహేందర్ పాల్గొన్నారు.