కల్వకుంట్ల కుటుంబంలో పుట్టి రాష్ట్ర ప్రజల గోస వింటున్నందుకు తనకు చాలా బాధగా ఉందని సీఎం కేసీఆర్ అన్న కూతురు రమ్యారావు అన్నారు. ‘కేసీఆర్ పరిపాలనతో చాలామంది కల్వకుంట్ల వంశాన్ని తిడుతున్నారు. ఎవరూ కల్వకుంట్ల వంశాన్ని తిట్టొద్దు. తిట్టాలనుకుంటే కేసీఆర్ కుటుంబాన్ని మాత్రమే తిట్టుకోండి’ అని అన్నారు. పోలీసులు, ఉద్యోగులు ఎందుకొచ్చిన తెలంగాణ అని ఆవేదన చెందుతున్నారని అన్నారు. హన్మకొండలో నిర్వహించిన తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి హాజరైన రమ్యారావు.. ఇది ఆత్మీయ సమ్మేళనం కాదు.. తెలంగాణ ఆవేదన సమావేశం అన్నారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రొఫెసర్ కోదండ రామ్ అప్పుడు కోకిల అయిండు.. ఇప్పుడు కాకి అయ్యిండా...? అని రమ్యారావు ప్రశ్నించారు. తెలంగాణ ఒక్కడి వల్లే రాలేదని, ఉద్యమం చేసినట్టే ఆకాంక్షల కోసం కొట్లాడే వారి వెంట నడిచేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. రాష్ట్ర ఆకాంక్షల కోసం మరో ఉద్యమం చేయాలంటూ కోదండ రామ్ కు విజ్ఞప్తి చేశారు. మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత కంటే ముందే జెండా పట్టి తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడినం అని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు వద్దకు వెళ్దామని, పోలీసులు ఎలా అడ్డుకుంటారో చూద్దామన్నారు. మేధావులు మౌనంగా ఉండటం వల్ల తెలంగాణకు నష్టం జరుగుతుందన్నారు. గతంలో కేసీఆర్ అన్నట్టుగా టీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తే రాష్ట్రంలో ఈ పరిస్థితి ఉండేది కాదని చెప్పారు.