మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల–అంతర్గాం గోదావరి బ్రిడ్జి నిర్మాణ స్థలాన్ని ఆర్అండ్ బీ సీఈ మోహన్ నాయక్అధికారులతో కలిసి మంగళవారం పరిశీలించారు. స్థానిక గౌతమేశ్వర ఆలయం వద్ద స్థలాన్ని పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ముల్కల్ల శివారులో స్థల పరిశీలన చేశారు. బీఆర్ఎస్ హయాంలో 2018 ఎన్నికల సందర్భంగా అప్పటి సీఎం కేసీఆర్ గోదావరిపై రూ.125 కోట్ల హైలెవల్ బ్రిడ్జిని సాంక్షన్ చేశారు. నిర్మాణంలో జాప్యం జరగడంతో అంచనా వ్యయాన్ని రూ.165 కోట్లకు పెంచుతూ రెండేండ్ల కిందట టెండర్లు నిర్వహించారు.
వల్లభనేని కన్స్ట్రక్షన్స్సంస్థ కాంట్రాక్ట్దక్కించుకుని సాయిల్ టెస్ట్ పనులు స్టార్ట్ చేసింది. ఆ సంస్థ చేసిన పనులకు సంబంధించిన బిల్స్ పెండింగ్ ఉండడంతో పనులు నిలిపేసింది. ఈలోగా అసెంబ్లీ ఎన్నికలు వచ్చి ప్రభుత్వం మారింది. మంచిర్యాల–అంతర్గాం బ్రిడ్జికి ప్రత్యామ్నాయంగా ముల్కల్ల శివారులో బ్రిడ్జి నిర్మించాలని ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు ప్రభుత్వానికి ప్రపోజల్స్ పంపిన నేపథ్యంలో అధికారులు రెండు ప్రదేశాలను పరిశీలించారు. బ్రిడ్జి ఎక్కడ కట్టాలన్న అంశంపై త్వరలోనే ఇంజనీర్ల టీమ్‌ను పంపుతామని సీఈ మోహన్ నాయక్ చెప్పినట్టు ఆర్అండ్బీ ఈఈ నర్సింహాచారి తెలిపారు.
మంచిర్యాల వద్దే బ్రిడ్జి నిర్మించాలి
గోదావరి బ్రిడ్జిని మంచిర్యాల గౌతమేశ్వర ఆలయం వద్దే నిర్మించాలని మంచిర్యాల–అంతర్గాం బ్రిడ్జి సాధన సమితి నాయకులు డిమాండ్ చేశారు. సీఈకి మెమోరాండం అందజేశారు. ఈ సందర్భంగా తుల మధుసూదన్ రావు మాట్లాడుతూ ఉద్యమాలు చేసి బ్రిడ్జిని సాధించుకున్నా.. పనులు ప్రారంభించకపోవడం బాధాకరమన్నారు. ఇక్కడ బ్రిడ్జి కట్టి మరో రూ.20 కోట్లు అదనంగా కేటాయించినట్లయితే 200 ఫీట్ల మున్సిపల్ రోడ్డు నిర్మించడంతోపాటు కాలేజ్ రోడ్డు, రైల్వే ఓవర్ బ్రిడ్జి వద్ద ట్రాఫిక్ ఐలాండ్ అభివృద్ధి చేయవచ్చన్నారు. కొందరు తప్పుడు సమాచారంతో బ్రిడ్జి పనులను నిలిపివేసి వేరే ప్రాంతానికి బ్రిడ్జిని తరలించాలని చూస్తున్నారని ఆరోపించారు. అది మంచిర్యాల ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడదన్నారు.