దొడ్డు వడ్లకు బోనస్ ఇవ్వబోమని ఎక్కడా చెప్పలే : మంత్రి వెంకట్​రెడ్డి

దొడ్డు వడ్లకు బోనస్ ఇవ్వబోమని ఎక్కడా చెప్పలే : మంత్రి వెంకట్​రెడ్డి
  • కేటీఆర్ ​నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడు: మంత్రి వెంకట్​రెడ్డి
  • జూన్​4 తర్వాత బీఆర్ఎస్ పార్టీ​ క్లోజ్ అయితది
  • 2,3 చోట్ల మాత్రమే ఆ పార్టీ డిపాజిట్ల కోసం ట్రై చేస్తున్నది
  • కేసీఆర్ ఫామ్​హౌస్​లో ఉంటే కేటీఆర్ సర్కారును నడిపిండు
  • కూలిపోయే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండు
  • బీఆర్ఎస్ అవినీతి గురించి దేశమంతా తెలుసు
  • కేసీఆర్ వెలమ టీం ఆఫీసర్లు 50 వేల కోట్లు వెనకేసుకున్నరు
  • ఓఆర్ఆర్ టెండర్లపై విచారణ జరుపుతున్నామని వెల్లడి

హైదరాబాద్, వెలుగు : దొడ్డు వడ్లకు బోనస్ ఇవ్వబోమని తమ ప్రభుత్వం, మంత్రులు ఎక్కడా చెప్పలేదని ఆర్ అండ్ బీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి స్పష్టం చేశారు. ​నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని బీఆర్ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ను హెచ్చరించారు. ఎంపీ ఎన్నికల రిజల్ట్స్​ (జూన్​ 4) తర్వాత  బీఆర్ఎస్ పార్టీ  క్లోజ్ అవుతుందని, ఎమ్మెల్యేలు, నేతలంతా ఆ పార్టీని వీడుతారని తెలిపారు.

2,3 సీట్లలో డిపాజిట్ కోసం బీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తున్నదని ఎద్దేవా చేశారు. కల్వకుంట్ల కవితకు బెయిల్ వచ్చేందుకు అన్ని సీట్లలో బీజేపీకి ఓటెయ్యాలని ఆ  పార్టీ నేతలు ఓపెన్ గా ఓటర్లకు చెప్పారని తాను నియోజకవర్గాల్లో పర్యటించిన సమయంలో తెలిసిందని మంత్రి గుర్తు చేశారు. ఎంపీ రిజల్ట్స్​తర్వాత కేటీఆర్, హరీశ్​రావు, కేసీఆర్.. కేఏ పాల్ లాగా మాట్లాడితే పబ్లిక్ వాళ్లను కొట్టడం ఖాయమని అన్నారు. 

పదేండ్లు అధికారంలో ఉండి 4 నెలల్లో మూతపడుతున్న పార్టీ ప్రపంచంలో బీఆర్ఎస్ ఒకటేనని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీకి  9 నుంచి 13 సీట్లు వస్తాయని చెప్పారు. గురువారం మినిస్టర్ క్వార్టర్స్ లో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, కౌన్సిల్ మాజీ చైర్మన్ నేతి విద్యాసాగర్ తో కలిసి మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి మీడియాతో మాట్లాడారు. “ఎంపీ ఎన్నికల్లో ఒక్క సీటు గెలిచే పరిస్థితి లేదు. కవిత జైల్లో ఉంది. కేసీఆర్ ఇంట్లో గొడవలు అవుతున్నయి. అందుకే ఓటమి ఫ్రస్ట్రేషన్​ తో కేటీఆర్, హరీశ్​ రావు ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నరు.

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో సీఎంపై కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేస్తుండు. సిగ్గులేని సీఎం అని అంటున్నడు. మా ఉద్యోగాలు మీరిచ్చిండ్రు అంటున్నడు. మరి అసెంబ్లీ ఎన్నికల ముందే 30 వేల ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేదో కేటీఆర్ చెప్పాలి. రాష్ట్రంలో ఆరు గ్యారంటీల అమలుతో మహిళలు సంతోషంగా ఉన్నరు. ఇందుకు సిగ్గులేని సీఎం అని అంటున్నారా? మీ నాన్న ఫాంహౌజ్ లో రెస్ట్ తీసుకుంటుంటే నలుగురు ఐఏఎస్ లతో దేశాలు, రాష్ట్రాలు తిరిగి రాజ్యమంతా నువ్వే నడిపినవ్ కదా?  హైదరాబాద్ నుంచి ఏ కంపెనీలు వెళ్లడం లేదు. ఇదంతా తప్పుడు ప్రచారం”  అని వెంకట్​రెడ్డి పేర్కొన్నారు. 

కేబుల్ బ్రిడ్జి కట్టి హైదరాబాద్​ను డెవలప్ చేసినం అంటున్నడు

పదేండ్లు అధికారంలో ఉండి మూసీని డెవలప్ చేయకుండా, హుస్సేన్​సాగర్​ను పట్టించుకోకుండా.. కేబుల్ బ్రిడ్జి ఒక్కటి కట్టి హైదరాబాద్ ను డెవలప్ చేసినా అని కేటీఆర్ చెప్పుకుంటున్నారని మంత్రి వెంకట్​రెడ్డి మండిపడ్డారు.  కేటీఆర్ నాలెడ్జ్ లేకుండా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ వెలమ టీం ఆఫీసర్ల ఆస్తులు 50 వేల కోట్లకు పైగా ఉంటాయని, విచారణలో అన్ని బయట పడుతున్నాయని  తెలిపారు. ఢిల్లీలో బీఆర్ఎస్ నేతలు ఇండ్లు అద్దెకి తీసుకొని లాయర్లతో కవిత బెయిల్ కోసం మాట్లాడుతున్నారని, ఒక్కో లాయర్ కు రూ.2 కోట్ల ఫీజు ఇస్తున్నారని ఆరోపించారు.

పదేండ్ల బీఆర్ఎస్ అవినీతి దేశమంతా తెలిసిందని, ఇతర రాష్ట్రాలకు వెళ్లినప్పుడు తెలంగాణ అని చెప్పగానే కాళేశ్వరం , లిక్కర్ స్కామ్ అని అంటున్నారని చెప్పారు.  లక్ష కోట్లతో కూలిపోయే కాళేశ్వరం కట్టారని ధ్వజమెత్తారు. ఓఆర్ ఆర్ టెండర్లను తక్కువకు అప్పగించి వేల కోట్ల కమీషన్ తీసుకున్నారని, వాటిపై విచారణ జరుపుతున్నామని మంత్రి స్పష్టం చేశారు.  ఔటర్ రింగ్ రోడ్ తమ ప్రభుత్వమే తీసుకొచ్చిందని

కాంగ్రెస్ పాలనలో ఎన్నో కంపెనీలు వచ్చాయని వెంకట్​రెడ్డి గుర్తు చేశారు. మూసీ అభివృద్ధిపై ఫోకస్ పెట్టామని, ఓల్డ్ సిటీలో మెట్రో స్టార్ట్ చేస్తున్నామని చెప్పారు.   ఆగస్టులో రీజినల్​రింగ్​రోడ్డు (ట్రిపుల్ ఆర్)​ టెండర్లు పిలుస్తున్నామని, భూసేకరణకు పరిహారం ఇచ్చేందుకు హడ్కో లోన్ తీసుకుంటున్నట్టు మంత్రి తెలిపారు. 

తీన్మార్​ మల్లన్నను గెలిపించండి

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీన్మార్​ మల్లన్నను గెలిపించాలని ఓటర్లకు మంత్రి వెంకట్​రెడ్డి విజ్ఞప్తి చేశారు. మల్లన్న మీద కేసులు ఉన్నాయని కేటీఆర్ అంటున్నారని, మల్లన్నతోపాటు మంద కృష్ణమాదిగ మీద కేసులు పెట్టింది మీ ప్రభుత్వమే కదా? అని కేటీఆర్​ను వెంకట్​రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలు ఆందోళన చేయకుండా హౌస్ అరెస్ట్ లు చేశారని చెప్పారు. లిక్కర్ స్కాంలో కవితపై 8వేల పేజీలతో చార్జిషీట్ దాఖలు చేశారని

దీని కంటే మల్లన్న కేసులు ఎక్కువా? అని ప్రశ్నించారు. టెట్ ఫీజు రూ.2వేలు అని కేటీఆర్ అంటున్నారని, బీఆర్ఎస్​ పాలనలో ఉద్యోగాలు లేక యువకులు మద్యం షాపులకు టెండర్లు దాఖలు చేశారని, నాన్ రిఫండబుల్ పేరుతో రూ.2 లక్షల ఫీజు వసూలు చేశారని వెంకట్​రెడ్డి గుర్తుచేశారు. షాప్ వస్తే వేరే వారికి లీజు కు ఇవ్వొచ్చనే ఆశతో యువత మద్యం షాపులుకు టెండర్లు దాఖలు చేశారని చెప్పారు. 

ఘనంగా వెంకట్​రెడ్డి బర్త్ డే వేడుకలు

మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి 68వ బర్త్ డే వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి.  బంజారాహిల్స్ లోని మంత్రి నివాసంలో, మినిస్టర్ క్వార్టర్స్ లో నిర్వహించిన వేడుకల్లో నల్గొండ జిల్లాతోపాటు వివిధ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, పార్టీ అభిమానులు, కార్యకర్తలు, ఆర్ అండ్ బీ అధికారులు పాల్గొన్నారు. మంత్రికి బర్త్​డే విషెస్​ చెప్పారు. టీటీడీ వేద పండితులు  ఆశ్వీరచనాలు అందజేశారు.  

ఉత్తమ్​ను విమర్శించే స్థాయి మహేశ్వర్​రెడ్డికి లేదు..

మంత్రి ఉత్తమ్​కుమార్​రెడ్డిని విమర్శించే స్థాయి బీజేపీ ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వర్​రెడ్డికి లేదని వెంకట్​రెడ్డి అన్నారు.  రాజాసింగ్ ను కాదని ఫైరవీలు చేసి ఫ్లోర్ లీడర్ పదవి తెచ్చుకున్నారని ఆరోపించారు. యు ట్యాక్స్ అని ఆయన ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తమ ప్రభుత్వం వచ్చి 3 నెలలు కూడా కాలేదని, 3 నెలలు ఎంపీ ఎన్నికల కోడ్ ఉన్నదని, ఈ కాలంలోనే ఢిల్లీకి కోట్లు పంపుతున్నామని ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. నిర్మల్ గురించి ఫండ్స్ అడగకుండా ట్యాక్స్ లు అంటూ ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఉత్తమ్ ఎయిర్ ఫోర్స్ లో పనిచేశారని, తన భార్యతో కలిసి రెంట్ హౌస్ లో ఉంటున్నారని వెంకట్​రెడ్డి తెలిపారు.