చెత్తను రీ సైక్లింగ్​ చేయాలి : కోమటిరెడ్డి వెంకటరెడ్డి

  • ఆర్‌‌‌‌‌‌‌‌అండ్‌‌‌‌బీ మినిస్టర్ కోమటిరెడ్డి

నల్గొండ అర్బన్​, వెలుగు :  చెత్తను రీసైక్లింగ్​చేసి ఆదాయం మార్గంగా మార్చుకోవాలని ఆర్‌‌‌‌‌‌‌‌అండ్‌‌‌‌బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌‌‌‌లో ‘చెత్తను వేరు చేసే పద్ధతులు, కలిగే ఉపయోగాలు’ అంశంపై నిర్వహించిన సమావేశానికి చీఫ్ గెస్టుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా  మున్సిపల్ కార్మికులు, రిసోర్స్ పర్సన్లకు ఐటీసీ ప్రతినిధులు అవగాహన కల్పించారు.  అనంతరం మంత్రి మట్లాడుతూ..  చెత్తను రీసైక్లింగ్ చేయడంతో కాలుష్యం కూడా తగ్గుతుందన్నారు.  ఇది చాలా మంచి కార్యక్రమమని,  తన వంతు సహకారం పూర్తిస్థాయిలో ఉంటుందని చెప్పారు.

అనంతరం ‘నా చెత్త నా బాధ్యత’ పేరుతో రూపొందించిన పోస్టర్‌‌‌‌‌‌‌‌ను కలెక్టర్ హరిచందన తో కలిసి ఆవిష్కరించారు .   కలెక్టర్ మాట్లాడుతూ ..  ప్రస్తుతానికి తడి చెత్త,, పొడి చెత్త వేరు చేస్తున్నప్పటికీ  వాటిని పర్ఫెక్ట్ గా రీసైక్లింగ్ చేస్తేనే  ఉపయోగం ఉందన్నారు.  చెత్త రీసైక్లింగ్‌‌‌‌లో  మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ నగరం  దేశంలో మొదటి స్థానంలో ఉందని, అక్కడ చెత్త సేకరణకు ప్రతి ఇంట్లో నాలుగు చెత్త డబ్బాలు ఉంచుతారని చెప్పారు.  

నల్గొండ పట్టణం కూడా ఆ స్థాయికి చేరేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.  ఈ కార్యక్రమంలో  మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేశ్,  ఆర్డీవో రవి, మున్సిపల్ కమిషనర్ ముసాబ్ అహ్మద్, ఐటీసీ ప్రతినిధి ఉమాకాంత్, నల్గొండ జడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య పాల్గొన్నారు.