- స్టార్టింగ్ స్టేజ్‌లో గుర్తిస్తే తగ్గించుకోవచ్చు: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
- గ్రేస్ రన్ లో పాల్గొన్న ఆర్ అండ్ బీ మంత్రి
హైదరాబాద్, వెలుగు : క్యాన్సర్ వ్యాధి దేశంలో లక్షలాది పేదల జీవితాలను చిన్నాభిన్నం చేస్తుందని.. దీన్ని కట్టడి చేసేందుకు మనమంతా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని ఆర్ అండ్ బీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. క్యాన్సర్ వ్యాధి కట్టడికి ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోందని ఆయన తెలిపారు. ఆదివారం గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ సంస్థ “రన్ ఫర్ గ్రేస్ స్ర్కీన్ ఫర్ లైఫ్” అనే నినాదంతో గచ్చిబౌలిలో నిర్వహించిన గ్రేస్ రన్ కార్యక్రమానికి మంత్రి చీఫ్ గెస్ట్ గా హాజరై మాట్లాడారు.
క్యాన్సర్ వ్యాధిని ప్రారంభ దశలో గుర్తిస్తే తగ్గించుకోవచ్చని డాక్టర్లు, నిపుణులు చెబుతున్నప్పటికీ ప్రజల్లో అవగాహన లేకపోవడం వల్ల వ్యాధి ముదిరి ప్రాణాలను హరిస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ వారు ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్‌లు చేస్తూ ప్రజలను క్యాన్సర్ బారిన పడకుండా అవగాహన కల్పించడంతో పాటు నిరుపేదల చికిత్సకు సహాయం అందించడం మంచి విషయమని ఆయన అన్నారు.
గ్రామీణ ప్రజలు క్యాన్సర్ బారిన పడితే.. చికిత్సకు డబ్బులు లేక వారి కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయని మంత్రి అన్నారు. గ్రేస్ ఫౌండేషన్ గ్రామీణ ప్రాంతాల్లో క్యాన్సర్ మొబైల్ స్క్రీనింగ్ కార్యక్రమాలు నిర్వహించి గ్రామీణులకు క్యాన్సర్ పై అవగాహన కల్పించడమే కాదు, క్యాన్సర్ నిర్ధారణ అయిన వారికి చికిత్సకు అండగా నిలుస్తుండటంపై మంత్రి అభినందించారు. గ్రేస్ క్యాన్సర్ రన్ అనేది ఒక కార్యక్రమం కాదు, క్యాన్సర్ పై పోరాడే ఉద్యమమని ఆయన అన్నారు. అంతకు ముందు క్యాన్సర్ రన్ లో పాల్గొన్న మంత్రి డీజే టిల్లు పాటకు నృత్యం చేసి యువతను ఉత్సహపరిచారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఎండీ సజ్జనార్, గ్రేస్ ఫౌండేషన్ ప్రతినిధులు డాక్టర్ చిన్నబాబు సుంకవల్లితో పాటు వేలాదిగా యువత రన్ లో పాల్గొన్నారు.