- గ్రేటర్ పరిధిలో పుంజుకుంటున్న రియల్ బూమ్
- రూ. 4,396 కోట్ల ఆమ్దానీతో రంగారెడ్డి జిల్లా ఫస్ట్
- రూ. 2,446 కోట్లతో మేడ్చల్మల్కాజిగిరి సెకండ్
హైదరాబాద్, వెలుగు : గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రియల్ వ్యాపారం క్రమంగా పుంజుకుంటోంది. భూముల అమ్మకాలు, కొనుగోళ్లు పెద్ద ఎత్తున సాగుతుండడంతో రిజిస్ట్రేషన్ కోసం సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో రద్దీ పెరిగింది. మూడు నెలల నుంచి రియల్ వ్యాపారం జోరుగా సాగుతుండడంతో ప్రభుత్వానికి కోట్లాది రూపాయల ఆదాయం సమకూరుతోంది.
టాప్‌లో రంగారెడ్డి జిల్లా
స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోవడంలో రంగారెడ్డి జిల్లా టాప్‌లో నిలిచింది. 2023 –24 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో రిజిస్ట్రేషన్లు, భూముల కొనుగోలు లావాదేవీలు భారీ సంఖ్యలో పెరగడంతో ఆదాయం పెద్ద మొత్తంలో సమకూరింది. 2023–24 సంవత్సరంలో జిల్లా వ్యాప్తంగా 2,48,560 డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్లు జరిగాయి. దీంతో మొత్తం రూ. 4,396 కోట్ల ఆదాయంతో రంగారెడ్డి జిల్లా రాష్ట్రంలోనే ఫస్ట్ ప్లేస్‌లో నిలిచింది. ఇక సెకండ్ ప్లేస్‌లో మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా నిలిచింది.
ఈ జిల్లాలో గత ఆర్థికసంవత్సరం 1,59,001 డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్లు జరుగగా రూ.2,446.85 కోట్ల ఆదాయం వచ్చింది. మూడో స్థానంలో నిలిచిన మెదక్‌లో 1,29,581 డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్లు జరిగితే రూ.1,120 కోట్లు, హైదరాబాద్ సౌత్‌లో 39,418 రిజిస్ట్రేషన్లతో రూ.980 కోట్ల ఆదాయం వచ్చింది. హైదరాబాద్ జిల్లాలో 20,941 డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్లు జరుగగా రూ.427 కోట్ల ఆమ్దానీ వచ్చింది.
టార్గెట్ చేరని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ
స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ 2023 – 24 ఆర్థిక సంవత్సరంలో ఆశించిన మేర ఆదాయాన్ని సమకూర్చుకోలేకపోయింది. ఈ సంవత్సరం రూ.18 వేల కోట్ల పైచిలుకు ఆదాయం వస్తుందని టార్గెట్‌గా పెట్టుకుంది. కానీ సుమారు రూ. 3,500 కోట్ల ఆదాయం తగ్గింది. గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 12,01,899 డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్లు జరుగగా ప్రభుత్వానికి రూ.11,275.17 కోట్ల ఆదాయం వచ్చింది. అలాగే వ్యవసాయ భూములకు సంబంధించి 5.91 లక్షల డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ కాగా వీటి ద్వారా రూ.1,564.23 కోట్లు వచ్చాయి. దీంతో గతేడాది స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా ప్రభుత్వానికి మొత్తం రూ.14,483 కోట్ల ఆదాయం సమకూర్చింది.
మూడేళ్లలో లక్ష నిర్మాణాలకు పర్మిషన్
గ్రేటర్ హైదరాబాద్‌లో పరిధిలో రియల్‌వ్యాపారం జోరందుకుంది. హెచ్‌ఎండీఏ పరిధిలో గత మూడేళ్లలో సుమారు లక్ష నిర్మాణాలకు పర్మిషన్ ఇచ్చారు. ఇక లే అవుట్లకు అయితే లెక్కే లేదు. పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలోని వారికి స్టిల్ట్ ప్లస్ 3, స్టిల్ట్ ప్లస్ 5 వరకు పర్మిషన్ ఇచ్చే అధికారం ఉంది. హెచ్‌ఎండీఏకు టీడీఆర్‌తో ప్రాంతాన్ని బట్టి గరిష్టంగా ఎన్ని అంతస్తుల వరకైనా పర్మిషన్ ఇవ్వొచ్చు.
హైదరాబాద్ నగరం రోజురోజుకు విస్తరిస్తున్న దృష్ట్యా వచ్చే పదేళ్ల కాలంలో రియల్ ఎస్టేట్ రంగం మరింత ఊపందుకునే అవకాశం ఉంది. కొత్త పరిశ్రమలు హైదరాబాద్ దారి పడుతున్న నేపథ్యంలో శివారు ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం మరింత విస్తరించేందుకు అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే రిజిస్ట్రేషన్లు, భూముల కొనుగోళ్లు భారీ సంఖ్యలో పెరుగుతున్నాయి.