కొరియోగ్రాఫర్ జానీకి బిగ్ షాక్.. బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేసిన కోర్టు

కొరియోగ్రాఫర్ జానీకి బిగ్ షాక్.. బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేసిన కోర్టు

రంగారెడ్డి: లైంగిక వేధింపుల కేసులో ప్రముఖ కొరియోగ్రాఫర్, జనసేన నేత జానీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఈ కేసులో జానీకి బెయిల్ ఇచ్చేందుకు రంగారెడ్డి జిల్లా పోక్సో కోర్టు నిరాకరించింది. తనకు బెయిల్ ఇవ్వాలంటూ జానీ దాఖలు చేసిన పిటిషన్‎ను కోర్టు తోసిపుచ్చింది. కాగా, అసిస్టెంట్ మహిళ కొరియోగ్రాఫర్‎పై లైంగిక వేధింపుల కేసులో కొరియోగ్రాఫర్ జానీ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండ్‎లో భాగంగా జైల్లో ఉన్న జానీకి ఇటీవల రంగారెడ్డి జిల్లా కోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. 

ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో బెస్ట్ కొరియోగ్రాఫర్‎గా నేషనల్ అవార్డు అందుకోవాలని.. అందుకోసం బెయిల్ ఇవ్వాలని జానీ పిటిషన్ దాఖలు చేశారు. జానీ విజ్ఞప్తి మేరకు అవార్డ్ ఫంక్షన్ కార్యక్రమానికి హాజరయ్యేందుకు న్యాయస్థానం ఐదు రోజుల పాటు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ కావడంతో జానీ నేషనల్ అవార్డును కమిటీ రద్దు చేసింది. దీంతో తిరిగి జానీ జైలుకు వెళ్లారు. ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండ్‎లో భాగంగా జైల్లో ఉన్న జానీ.. మరోసారి రంగారెడ్డి జిల్లా పోక్సో కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. 

ALSO READ | బెయిల్ పిటిషన్లు తిరస్కరణ.. బోరున ఏడ్చిన పవిత్ర గౌడ

 

ఈ పిటిషన్‎పై ఇవాళ (అక్టోబర్ 14) విచారణ చేపట్టిన న్యాయస్థానం జానీకి బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. కేసు విచారణ కీలక దశలో ఉన్నదని.. ఈ సమయంలో బెయిల్‎పై జానీ బయటకు వెళ్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని నార్సింగ్ పోలీసులు న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. నార్సింగ్ పోలీసులు విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న రంగారెడ్డి జిల్లా పోక్సో కోర్టు.. జానీ బెయిల్ పిటిషన్‎ను డిస్మిస్ చేసింది. దీంతో మరోసారి జానీకి నిరాశ ఎదురైంది.