కోతులకు రోజురోజుకు కోపం పెరిగిపోతుంది. దీంతో పగబట్టినట్టుగా ఇంట్లోకి వెళ్లిమరి పిల్లలను కరుస్తున్నాయి. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లోని ఎర్రబోడ గ్రామంలో ఓ ఇంట్లో ఎవరూ లేని సమయంలో చిన్నారిపై దాడి చేసింది. కాపు కాసి చిన్నారిని కరిచింది. చిన్నారి కాళ్లు పట్టి లాగి.. కోతి కరిచింది. దీంతో గట్టిగా కేకలు వేస్తూ.. ఆ చిన్నారి భయంతో ఇంట్లోకి పరుగులు తీసింది.
చిన్నారిపై దాడి చేసిన తర్వాత కూడా ఆ కోతి ఇంటిముందే దర్జాగా కూర్చుంది. ఇంటి బయట ఉన్న సామాగ్రిని పడేస్తూ.. మోటార్ సైకిల్ సీట్లను చించేసింది. చిన్నారి అరుపులు విన్న స్థానికులు కర్రలు పట్టుకొని వచ్చి.. ఆ కోతిని అక్కడి నుంచి తరిమికొట్టారు. అనంతరం చిన్నారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
అయితే గత కొన్ని రోజులుగా కోతులు తమ గ్రామంలో రెచ్చిపోతున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఒంటరిగా ఎవరూ కనిపించిన వదలటం లేదని.. బయటకు రావాలంటేనే భయమేస్తుందని చెబుతున్నారు. స్కూల్ కు వెళుతున్న విద్యార్థులపై పగబట్టినట్టుగా ఎగబడుతున్నాయని అంటున్నారు.
అడవుల్లో ఆహారం దొరకకపోవడంతో కోతులు గ్రామాల్లో తిష్టవేస్తున్నాయని.. ఆహారం కోసం ఇండ్లలోకి దూరి చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా దాడికి పాల్పడుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. కోతుల బెదడ నుంచి మమ్మల్ని కాపాడాలంటూ అటవీ శాఖ అధికారులకు స్థానికులు విజ్ఞప్తి చేశారు.