వరంగల్లోనూ ఆస్తిపన్నులో 90 శాతం రాయితీ

వరంగల్లోనూ ఆస్తిపన్నులో 90 శాతం రాయితీ
  • వరంగల్‍ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని చొరవతో ఓటీఎస్‍ అమలు

వరంగల్‍, వెలుగు:  గ్రేటర్‍ వరంగల్‌లోని  జీడబ్ల్యూఎంసీలోనూ ఆస్తి పన్నుపై వడ్డీలో  90  శాతం రాయితీ కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీఓ విడుదల చేసింది. ఇప్పటివరకు కేవలం హైదరాబాద్‌లోనే  ఈ తరహా ‘వన్‍ టైం సెటిల్‍మెంట్‌’ (ఓటీఎస్‍) అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ 2024–25 ఆర్థిక సంవత్సరానికిగానూ పేరుకుపోయిన మొండి బకాయిదారులకు ట్యాక్స్  చెల్లించే క్రమంలో పడ్డ వడ్డీపై కేవలం 10 శాతం మాత్రమే విధించి 90 శాతం మాఫీ చేస్తున్నారు.

 కాగా, గ్రేటర్‍ వరంగల్‌ లో  హైదరాబాద్‍ తరహాలో 90 శాతం బకాయి వడ్డీని మాఫీ చేసేలా వన్‍ టైం సెటిల్‍మెంట్‍కు అవకాశం ఇవ్వాలని..  గ్రేటర్‍ వరంగల్‍ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‍రెడ్డి మంగళవారం అసెంబ్లీలో ప్రభుత్వాన్ని కోరారు.  దీన్ని మిగతా ఎమ్మెల్యేలు సమర్థించారు.  నాయిని చొరవతో రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది.  మున్సిపల్‍ శాఖ అధికారులు అన్ని మున్సిపాలిటీల్లో  90 శాతం వడ్డీ రాయితీ అందించాలని  మంగళవారం రాత్రి జీఓ విడుదల చేశారు. దీంతో ఇక్కడి ప్రజలు పన్ను కట్టే సమయంలో 90 శాతం రాయితీ పొందే అవకాశం లభించినట్లయింది.