సిద్దిపేట, వెలుగు: జిల్లాలో సాగునీటి కోసం నిర్మించిన ప్రాజెక్టులు డెత్ స్పాట్లుగా మారుతున్నాయి. నాలుగేండ్ల కింద ప్రారంభించిన రంగనాయక సాగర్, కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్లలో ఇప్పటి వరకు 50 మందికి పైగా మృతి చెందారు. కొందరు ఈత కోసం రిజర్వాయర్ లోకి దిగి చనిపోగా, మరికొందరు సూసైడ్చేసుకుంటున్నారు. టూరిస్టులు ఎక్కువగా రిజర్వాయర్ల వద్దకు వచ్చి నీళ్లలోకి దిగి ఈతరాక చనిపోతున్నారు.
నిన్న హైదరాబాద్ కు చెందిన ఐదుగురు యువకులు కొండపోచమ్మ రిజర్వాయర్ లో మృతి చెందడంతో ఆయా రిజర్వాయర్ల వద్ద రక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని తెలియజేస్తోంది. కాళేశ్వరం ప్రాజక్టులో భాగంగా సిద్దిపేట పట్టణ శివార్లలోని చంద్లాపూర్ వద్ద 3 టీఎంసీల సామర్థ్యంతో రంగనాయక సాగర్, మర్కుక్ మండల కేంద్రానికి సమీపంలో 15 టీఎంసీల సామర్థ్యంతో కొండ పోచమ్మ సాగర్ రిజర్వాయర్ ను నిర్మించారు.
ఈ రెండు రిజర్వాయర్లకు హైదరాబాద్ దగ్గరగా ఉండడంతో పాటు రాజీవ్ రహదారికి సమీపాన ఉండడంతో జనం ఎక్కువగా సందర్శిస్తున్నారు. రెండు రిజర్వాయర్ల వద్ద రెండు ప్రధాన గేట్లను ఏర్పాటు చేసి ప్రజల రాకపోకలను నియంత్రిస్తున్నా ఏదో ఒక చోట నుంచి నీళ్లలోకి దిగుతున్నారు. ప్రాజెక్ట్లోపల లోతైన గోతులు ఉన్న విషయం తెలియక లోపలికి వెళ్లి కొందరు మునిగి పోగా వారిని రక్షించే ప్రయత్నాల్లో మరికొందరు మృత్యువాత పడుతున్నారు. మరికొందరు కుటుంబ, ఆర్థిక సమస్యలతో రిజర్వాయర్లలో దూకి సూసైడ్చేసుకుంటున్నారు.
రిజర్వాయర్ల వద్ద తరచుగా ప్రమాదాలు
నిన్న కొండపోచమ్మ ప్రాజెక్ట్‌లో జరిగిన ఘటనలో హైదరాబాద్ కు చెందిన ఐదుగురు యువకులు పాముల పర్తి సమీపంలో బైక్‌లను పార్క్ చేసి కొంత దూరం నడిచి రిజర్వాయర్ కట్టను దాటి నీళ్లున్న ప్రాంతానికి వెళ్లారు. రిజర్వాయర్ ప్రధాన మార్గంలో గేట్లను పెట్టినా టూరిస్టులు వేరే మార్గాల గుండా రిజర్వాయయర్ల లోకి వెళ్తున్నారు. దీంతో నీటిలో మునిగిపోతున్నప్పుడు కాపాడే పరిస్థితి లేకుండా పోతుంది. రంగనాయక సాగర్ వద్ద పరిస్థితి వేరుగా ఉంటుంది. ప్రధాన గేటు నుంచి లోపలకి వెళ్లిన తర్వాత గుట్ట వెనుక వైపు ప్రాంతంలోంచి కొందరు నీటిలోకి దిగుతున్నారు. మరికొందరికి అవి సూసైడ్స్పాట్స్ గా మారుతున్నాయి.
పెరుగుతున్న టూరిస్టులు
ఈ రెండు రిజర్వాయర్ల వద్దకు పర్యాటకుల రాక రోజు రోజుకు పెరుగుతోంది. హైదరాబాద్‌కు దగ్గరగా ఉండడంతో ఒకే రోజు రెండు రిజర్వాయర్లను సందర్శిస్తూ ఎంజాయ్‌చేస్తున్నారు. రెండు రిజర్వాయర్లు దాదాపు సగానికి పైగా నీళ్లతో నిండి ఉండడంతో లోపల గుంతల విషయం తెలియక చాలామంది నీటిలోకి దిగి మునిగి చనిపోతున్నారు. మరికొందరు ఈతరాక మృత్యుఒడిలోకి వెళ్తున్నారు. రంగనాయక సాగర్ ప్రధాన మార్గంలో ప్రమాదాలు నివారించడానికి పోలీసులు కొద్ది రోజుల కింద సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.
ఈ రెండు ప్రాజెక్టుల వద్ద తరచుగా ప్రమాదాలు జరుగుతుండడంతో రక్షణకు అధికారులు చర్యలు తీసుకోవాలి. ప్రమాదాల నివారణ కోసం ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేయడంతో పాటు రిజర్వాయర్ చుట్టు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడూ పర్యవేక్షించాలి. అప్పుడే భవిష్యత్‌లో మరిన్ని మరణాలను ఆపే అవకాశం ఉంటుంది. రిజర్వాయర్ల వద్ద గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచడంతో పాటు పర్యాటకులపై ఓ కన్నేసి ఉంచితే ప్రమాదాలు జరిగిన వెంటనే రక్షణ చర్యలు తీసుకోవచ్చు.
కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ లో జరిగిన ఘటనలు
కూకట్ పల్లి కేపీ హెచ్‌పీ కాలనీకి చెందిన వడ్లమూడి అక్షయ్ వెంకట్ (27), సికింద్రా బాద్ బోయిన్ పల్లి కి చెందిన రాజన్ శర్మ (27), సాఫ్ట్వేర్ఉద్యోగులు. కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ లో ఈత కోసం వెళ్లి నీటిలో మునిగి మృతి చెందారు.
శేర్లింగంపల్లికి చెందిన ఎండీ అబ్దుల్ ఆసిబ్ (20) ఈత కోసం రిజర్వాయర్ లోకి దిగి నీటిలో మునిగి చనిపోయాడు.
హైదరాబాద్ లోని ముషీరాబాద్‌కు చెందిన గ్యార ధనుశ్(20), లోహిత్(18), చీకట్ల దినేశ్వర్(17), ఉప్పల జతిన్(17), సుతార్ సాయల్(18) కొండ పోచమ్మ సాగర్ రిజర్వాయర్ లో ప్రమాదవశాత్తుమునిగి చనిపోయారు.
రంగనాయక సాగర్ రిజర్వాయర్ లో జరిగిన సంఘటనలు
- సిద్దిపేట పట్టణం గణేశ్ నగర్ కు చెందిన మరిగంటి సత్యనారాయణాచార్యులు(51) రంగనాయక సాగర్ రిజర్వాయర్ లో దూకి సూసైడ్చేసుకున్నాడు.
- సిద్దిపేట పట్టణం శంకర్ నగర్ కు చెందిన ఇరుగదిండ్ల అశ్విని (22) రంగనాయక సాగర్ రిజర్వాయర్ లో శవమై తేలింది.
- సిద్దిపేట పట్టణానికి చెందిన ప్రైవేటు టీచర్ రాజు ఆర్థిక సమస్యలతో రిజర్వాయర్ లో దూకి సూసైడ్చేసుకున్నాడు.