సిద్దిపేట రూరల్, వెలుగు : జిల్లాలోని రంగనాయక సాగర్, మల్లన్న సాగర్ రిజర్వాయర్ల డిస్ట్రిబ్యూటరీ కెనాల్ భూసేకరణ ప్రక్రియ వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ ఎం. మను చౌదరి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ లో రంగనాయక సాగర్, మల్లన్న సాగర్ రిజర్వాయర్ కు సంబంధించిన డిస్ట్రిబ్యూటరీ కెనాల్ భూసేకరణ ప్రక్రియపై అడిషనల్ కలెక్టర్ అబ్దుల్ హమీద్, ఇరిగేషన్, రెవెన్యూ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఇరిగేషన్ శాఖ అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రిజర్వాయర్ కెనాల్ గురించి వివరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ రంగనాయక సాగర్, మల్లన్న సాగర్ రిజర్వాయర్ నుంచి నీటి పంపిణీ ప్రక్రియకు సంబంధించిన మేజర్ కెనాల్ పనులు దాదాపు పూర్తయినా, మైనర్, సబ్ మైనర్ కెనాల్ కు భూసేకరణ ప్రక్రియ పూర్తి చేస్తే ఆయకట్టు గణనీయంగా పెరిగే అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ సమావేశంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గీత, ఆర్డీవో సదానందం, ఇరిగేషన్ శాఖ అధికారులు పాల్గొన్నారు.