రంగారెడ్డి, వెలుగు: జిల్లాలో భారీ వర్షాలు, వరదల వల్ల కలిగిన నష్టాలపై వెంటనే రిపోర్టు ఇవ్వాలని రంగారెడ్డి కలెక్టర్ శశాంక అధికారులను ఆదేశించారు. మంగళవారం వీసీ ద్వారా సమీక్ష జరిపారు. రెండు రోజుల భారీ వర్షాల వల్ల జిల్లాలో దాదాపు 40 ఇండ్లు పాక్షికంగా, రెండు ఇండ్లు పూర్తిగా ధ్వంసమైనట్లు గుర్తించామని, నష్టం వివరాలను వెంటనే సమర్పించాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు కృషి చేయాలన్నారు.
నాలాలున్న ప్రాంతాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. జిల్లాలోని 100 చెరువులకు ప్రిలిమినరీ నోటిఫికేషన్ పెండింగ్ లో ఉన్నాయని, ఇప్పటి వరకు 925 చెరువుల్లో 99 చెరువులకు మాత్రమే ఫైనల్ నోటిఫికేషన్ పూర్తయిందని తెలిపారు. మిగతావాటికి సకాలంలో నోటిఫికేషన్ పూర్తి చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ల్యాండ్ ప్రొటెక్షన్ అధికారి కేఎస్బీ కుమారి, తహసీల్దార్లు, ఆర్డీఓలు పాల్గొన్నారు.