వచ్చే నెలలో మళ్లీ వస్తా..డెలివరీలు పెరగాలి : కలెక్టర్ సి.నారాయణరెడ్డి

వచ్చే నెలలో మళ్లీ వస్తా..డెలివరీలు పెరగాలి : కలెక్టర్ సి.నారాయణరెడ్డి
  •     రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆదేశం
  •     షాద్​నగర్​ ఆస్పత్రిలో వార్డులు క్లీన్​గా లేకపోవడంపై అసంతృప్తి 

షాద్ నగర్, వెలుగు : రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి శుక్రవారం షాద్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. వార్డుల్లో తిరిగి పేషెంట్లు, అటెండెంట్లతో మాట్లాడారు. అక్కడి సదుపాయాలు, అందుతున్న సేవలపై ఆరా తీశారు. హాస్పిటల్​ఆవరణ, పార్కింగ్, వార్డులు అపరిశుభ్రంగా ఉండడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వారానికోసారి హాస్పిటల్ ను విజిట్ చేయాలని ఆర్డీఓ సరితను ఆదేశించారు. ముగ్గురు గైనకాలజిస్టులు ఉన్నప్పటికీ డెలివరీలు ఎందుకు పెరగడం లేదని డాక్టర్లను ప్రశ్నించారు. 

నెలకు 300 డెలివరీలు జరిగేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కొందరు ప్రైవేట్ ఆసుపత్రుల్లో పనిచేస్తున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయని, నిజమని తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని, ఇక్కడికి వచ్చే పేషెంట్లను ప్రైవేట్ ఆస్పత్రులకు తరలిస్తున్నట్లు రుజువైతే ఉద్యోగాలు వదులుకోవాల్సిందేనని హెచ్చరించారు. వచ్చే నెలలో మరోసారి వస్తానని, డాక్టర్లు, సిబ్బంది తీరులో మార్పు రావాలని సూచించారు. ఆసుపత్రిలో సిబ్బంది కొరత ఉన్నట్లు కార్యనిర్వహణ అధికారి శ్రీనివాస్ రెడ్డి కలెక్టర్ దృష్టికి తెచ్చారు.