- కానిస్టేబుల్‌పై హత్యాయత్నం, స్నాచింగ్ కేసులో తీర్పు
ఎల్బీనగర్, వెలుగు: వరుస చైన్ స్నాచింగ్‌లకు పాల్పడడంతోపాటు కానిస్టేబుల్‌పై హత్యాయత్నం చేసిన ముగ్గురికి రంగారెడ్డి జిల్లా కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష, రూ.వెయ్యి జరిమానా విధించింది. పోలీసుల వివరాల ప్రకారం.. కర్నాటకకు చెందిన ఇషాన్ నిరంజన్(23), రాహుల్(21), ఏపీకి చెందిన బత్తుల వెంకటేశ్వరరావు(24) జల్సాలకు అలవాటుపడి ఈజీ మనీ కోసం చైన్ స్నాచింగ్‌లకు పాల్పడ్డారు. గచ్చిబౌలి, ఆర్సీపురం, కూకట్ పల్లి పరిధిలో వీరిపై కేసులు నమోదయ్యాయి.
ఈ క్రమంలో ఆర్సీపురం పోలీసులు వాహన తనిఖీలు చేపట్టగా, ఇషాన్ నిరంజన్, రాహుల్ తారసపడ్డారు. అనుమానం వచ్చి వారిని కానిస్టేబుల్ యాదయ్య ఆపే ప్రయత్నం చేయగా, కత్తితో దాడి చేసి పరారయ్యారు. అనంతరం యాదయ్య పట్టు వదలకుండా నిందితులను పట్టుకున్నారు. వీరిచ్చిన సమాచారంతో వెంకటేశ్వరావును కూడా అరెస్ట్ చేశారు.
2022లో జరిగిన ఈ కేసుకు సంబంధించి పూర్తి ఆధారాలను పరిశీలించిన రంగారెడ్డి జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి శశిధర్ రావు సోమవారం తీర్పును వెలువరించారు. కానిస్టేబుల్‌పై హత్యాయత్నం చేసినందుకు ఇషాన్ నిరంజన్, రాహుల్‌కు ఏడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.వెయ్యి జరిమానా విధించారు. మరో మూడు చైన్ స్నాచింగ్ కేసుల్లో ఈ ముగ్గురికి ఐదేళ్లు, మూడేళ్ల చొప్పున జైలు శిక్ష ఖరారు చేశారు.