ఎల్బీనగర్, వెలుగు: ప్రేమ పేరుతో బాలికను కిడ్నాప్‌చేసి లైంగికదాడికి పాల్పడిన యువకుడికి రంగారెడ్డి జిల్లా కోర్టు 20 ఏండ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. పీపీ సునీత, సరూర్ నగర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా పోలెపల్లికి చెందిన వరికుప్పల మహేశ్(23) 2018లో హైదరాబాద్ కు చెందిన బాలికను పరిచయం చేసుకున్నాడు. ప్రేమ పేరుతో ఆమెను కిడ్నాప్ చేశాడు. ఆపై లైంగికదాడికి పాల్పడ్డాడు.
బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో సరూర్ నగర్ పోలీసులు మహేశ్‌పై పోక్సో యాక్ట్ తోపాటు కిడ్నాప్, లైంగికదాడి కేసులు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. దర్యాప్తు అనంతరం సాక్ష్యాధారాలతో రంగారెడ్డి జిల్లా కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేశారు. పరిశీలించిన కోర్టు మహేశ్‌ని నేరస్తుడిగా నిర్ధారించింది. 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షతోపాటు రూ.25 వేల జరిమానా విధిస్తూ మంగళవారం కోర్టు తీర్పు చెప్పింది. బాధితురాలికి రూ.5 లక్షల నష్ట పరిహారం అందించినట్లు పోలీసులు తెలిపారు.