రైల్వే స్టేషన్ ఘోరం.. ఊహించని ఘటన. రంగారెడ్డి జిల్లా శివరాంపల్లి రైల్వే స్టేషన్ లోనే ఓ మహిళ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవటం కలకలం రేపుతోంది. రైల్వేస్టేషన్ లో ఆత్మహత్య అనగానే.. రైలు పట్టాలపై.. రైలు కింద పడి అనే వార్తలు వింటూ ఉంటాం.. ఈ ఘటన అందుకు భిన్నంగా జరిగింది. రైల్వేస్టేషన్ లోకి వచ్చిన ఓ మహిళ.. ఫుట్ ఓవర్ బ్రిడ్జికి తన చున్నీతో ఉరేసుకుని చనిపోవటం కలకం రేపుతోంది. 2024, జనవరి 27వ తేదీ తెల్లవారుజామున.. రైల్వే సిబ్బంది గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. అర్థరాత్రి సమయంలో ఈ మహిళ ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని భావిస్తున్నారు రైల్వే పోలీసులు.
రైల్వేస్టేషన్ లో ఆత్మహత్య చేసుకున్న మహిళ ఎవరు.. కారణాలు ఏంటీ అనే విషయాలపై విచారణ చేస్తున్నారు. మహిళ దగ్గర ఎలాంటి ఆధారాలు లేకపోవటం, సూసైడ్ నోట్ కూడా లేకపోవటంతో.. ఆత్మహత్య చేసుకుని మహిళ ఫొటోలను అన్ని పోలీస్ స్టేషన్లకు పంపించారు అధికారులు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. శివరాంపల్లి రైల్వేస్టేషన్ ఆత్మహత్య ఘటన చుట్టుపక్కల ప్రాంతాల్లో చర్చనీయాంశం అయ్యింది.