రంగశాయిపేట సోషల్​ వెల్ఫేర్ కాలేజీలో .. విద్యార్థినులకు విష జ్వరాలు

  • 50 మందికి జ్వర లక్షణాలు
  • 26 మంది స్టూడెంట్స్​కు జ్వరంతో పాటు వాంతులు
  • ఎంజీఎం హాస్పిటల్​లో అడ్మిట్​చేసిన అధికారులు
  • సాయంత్రం ఒకరి డిశ్చార్జ్​.. 
  • మరికొంతమందికి హాస్టల్​లోనే ట్రీట్​మెంట్

హనుమకొండ/ వరంగల్ సిటీ, వెలుగు : వరంగల్ సిటీలోని రంగశాయిపేట సోషల్ ​వెల్ఫేర్​ బాలికల గురుకుల డిగ్రీ కాలేజీలో విద్యార్థినులు విష జ్వరాలతో బాధపడుతున్నారు. రెండు రోజుల కింద కొంత మంది స్టూడెంట్లకు జ్వరం రాగా ట్యాబ్లెట్లు ఇచ్చారు. అయినా తగ్గకపోగా వాంతులు చేసుకుంటుండడంతో 26 మందిని శుక్రవారం ఉదయం వరంగల్ ఎంజీఎం దవాఖానకు తరలించారు. 

వరంగల్ రంగశాయిపేటలోని తెలంగాణ సోషల్​రెసిడెన్సియల్ ​విమెన్స్​ డిగ్రీ కాలేజీలో దాదాపు 450 మంది విద్యార్థినులున్నారు. హాస్టల్ ​చుట్టుపక్కల దోమలు విపరీతంగా ఉండడంతో కొద్ది రోజుల కింద దాదాపు 50 మంది జ్వరం బారిన పడ్డారు. విషయాన్ని హాస్టల్​సిబ్బంది దృష్టికి తీసుకెళ్లడంతో రెండు రోజుల నుంచి స్థానిక ఏఎన్ఎంతో మెడిసిన్స్​ఇప్పిస్తున్నారు. హాస్టల్​ డాక్టర్​ కొద్దిరోజులుగా మెటర్నిటీ లీవ్​లో ఉండడం, మెడిసిన్స్​తో జ్వరం తగ్గకపోవడంతో స్టూడెంట్లు మరింత అస్వస్థతకు గురయ్యారు. 

దీంతో 26 మందికి జ్వరం పెరిగి, వాంతులు కావడంతో శుక్రవారం ఎంజీఎంలో చేర్పించారు. ఇక్కడ స్టూడెంట్స్​ కోసం ప్రత్యేకంగా ఫీవర్​ వార్డు ఏర్పాటు చేశారు. ఒక స్టూడెంట్ ఆరోగ్యం మెరుగుపడడంతో డిశ్చార్జ్​ చేశారు. మిగిలిన వారి ఆరోగ్యం బాగానే ఉందని ఎంజీఎం సూపరింటెండెంట్​ డా.వి.చంద్రశేఖర్​ తెలిపారు. ప్రిన్సిపాల్ ​సురేశ్​ మాట్లాడుతూ పిల్లలందరూ బాగానే ఉన్నారని, వారి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చామన్నారు. డీఎంహెచ్​వో డాక్టర్​ కె.వెంకటరమణ శుక్రవారం హాస్టల్​ను విజిట్​ చేశారు. ఆరోగ్య పరిస్థితిని బట్టి హాస్టల్​లోనే చికిత్స చేసేందుకు ఏర్పాట్లు చేశారు.