Global Super League 2024: గ్లోబల్ సూపర్ లీగ్ విజేత రంగ్‌పూర్ రైడర్స్

Global Super League 2024: గ్లోబల్ సూపర్ లీగ్ విజేత రంగ్‌పూర్ రైడర్స్

గ్లోబల్ సూపర్ లీగ్ ప్రారంభ ఎడిషన్‌ విశ్వ విజేతగా బంగ్లాదేశ్ జట్టు రంగ్‌పూర్ రైడర్స్ నిలిచింది. శుక్రవారం (డిసెంబర్ 06) రాత్రి విక్టోరియాతో జరిగిన సమ్మిట్ క్లాష్‌లో రంగ్‌పూర్ రైడర్స్ 56 పరుగుల తేడాతో విజయం సాధించింది. రైడర్స్ బ్యాటర్ సౌమ్య సర్కార్ 54 బంతుల్లో 86* పరుగులతో అద్భుతంగా రాణించి జట్టును విజేతగా నిలిపాడు.

తొలుత బ్యాటింగ్ చేసిన రంగ్‌పూర్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు నష్టపోయి 178 పరుగులు చేసింది. స్టీవెన్ టేలర్ (68; 49 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లు), సౌమ్య సర్కార్ (86; 54 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్స్‌లు) అర్ధ శతకాలు బాదారు. అనంతరం లక్ష్య ఛేదనలో విక్టోరియా 122 పరుగులకే కుప్పకూలింది. జో క్లార్క్ (22 బంతుల్లో 40; 7 ఫోర్లు ) ఒక్కడూ కాసేపు ఒంటరి పోరాటం చేశాడు. ఛేదనలో విక్టోరియా ఏ దశలోనూ విజయం దిశగా సాగలేదు. రైడర్స్ స్పిన్నర్లు వైవిధ్యమైన బంతులతో ఆసీస్ బ్యాటర్లకు ముచ్చెమటలు పట్టించారు. హర్మీత్ సింగ్ 3, మహేదీ హసన్ 2, రిషద్ హొస్సేన్ 2, సైఫ్ హసన్ 2 వికెట్లు పడగొట్టారు. 

Also Read :- తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియాకు 157 పరుగుల ఆధిక్యం

ఏంటి ఈ గ్లోబల్ సూపర్ లీగ్..?

ఐపీఎల్ తరహాలో ఇతర దేశాలలో జరిగే ఫ్రాంచైజీ లీగ్‌ల్లో విజేతగా నిలిచిన జట్లను ఆహ్వానించి 'గ్లోబల్ సూపర్ లీగ్ (2024)' పేరుతో ఈ టోర్నీ నిర్వహించారు. మొత్తం ఐదు దేశాలకు చెందిన ఐదు ఫ్రాంచైజీ జట్లు ఇందులో పాల్గొన్నాయి.

  • విక్టోరియా (ఆస్ట్రేలియా)
  • రంగ్‌పూర్ రైడర్స్ (బంగ్లాదేశ్)
  • గయానా అమెజాన్ వారియర్స్ (వెస్టిండీస్)
  • లాహోర్ ఖలందర్స్ (పాకిస్తాన్)    
  • హాంప్‌షైర్ (ఇంగ్లండ్)