సిరిసిల్లలో పవర్ లూం క్లస్టర్ ఏర్పాటు చేయిస్త: రాణీ రుద్రమ

రాజన్న సిరిసిల్ల, వెలుగు : తనను గెలిపిస్తే సిరిసిల్లలో పవర్ లూం కస్టర్ ను ఏర్పాటు చేయిస్తానని, నేతన్న సాక్షిగా ప్రమాణం చేసి హామీ ఇస్తున్నానని సిరిసిల్ల బీజేపీ ఎమ్యెల్యే అభ్యర్థి రాణీ రుద్రమ అన్నారు. ఈ మేరకు బాండ్ పేపర్ పై రాసిన హామీ పత్రాన్ని ఆమె చదివి వినిపించారు. మంగళవారం ఆమె సిరిసిల్లలో కొత్త బస్టాండ్  నుంచి పాత బస్టాండ్  వరకు ర్యాలీ నిర్వహించారు. పాత బస్టాండ్ లోని చేనేత విగ్రహానికి పూలమాల వేసి మాట్లాడారు.  బీజేపీ ఒక్కసారి మాటిస్తే తప్పే పార్టీ కాదన్నారు. రాష్ట్రంలో పసుపు బోర్డు ఇస్తానని మాట ఇచ్చి నిలబెట్టుకున్నామని పేర్కొన్నారు.

సిరిసిల్ల ప్రజాదరణ చూస్తే తన గెలుపు ఖాయం అయ్యిందన్నారు. నేతన్నలకు శాశ్వత పరిష్కారం చూపించడంలో గత ప్రభుత్వాలు విఫలం అయ్యాయని విమర్శించారు. కేంద్ర మంత్రి విద్యాసాగర్ రావు తంగళ్లపల్లిలో టెక్స్ టైలల్స్ పార్కు ఏర్పాటు చేస్తే కనీసం దాన్ని నడపడం కూడా తెలంగాణ ప్రభుత్వానికి చేతకాలేదని మండిపడ్డారు. బతుకమ్మ చీరలతో కొంతమంది బడాబాబులు కోట్లు సంపాదించారని, నేతలన్నలకు ఒరిగిందేమీ లేదన్నారు. గొప్ప నేతన్నలున్న సిరిసిల్లలో నేతలను పాలిస్టర్  ఉత్పత్తులకు పరిమితం చేశారన్నారు.

ఒకప్పుడు బాగా బతికిన ఆసాములు డైయింగ్  నడుపుకోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. తనను సిరిసిల్ల ఎమ్యెల్యేగా గెలిపిస్తే కేంద్రాన్ని ఒప్పించి సిరిసిల్లకు పవర్ లూం క్లస్టర్ ను ఏర్పాటు చేయిస్తానని హామీ రుద్రమ ఇచ్చారు. ప్రచారంలో మున్సిపల్ మాజీ చైర్మన్  ఆడేపు రవీందర్, బీజేపీ టౌన్  ప్రెసిడెంట్  నాగుల శ్రీనివాస్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.