సిరిసిల్లలో కాషాయ జెండా ఎగరేస్తాం : రాణిరుద్రమ

రాజన్న సిరిసిల్ల,వెలుగు : సిరిసిల్ల గడ్డపై కాషాయ జెండా ఎగురవేస్తామని బీజేపీ ఎమ్యెల్యే అభ్యర్థి రాణిరుద్రమ ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం సిరిసిల్లలో ఆమె అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించి, బీజేపీ లీడర్లతో సమావేశమయ్యారు. బీజేపీలో మహిళలకు, బీసీలకు పెద్దపీట వేసి సముచిత స్థానం కల్పిస్తోందన్నారు. ఇప్పటివరకు ఏ పార్టీ కూడా బీసీ అభ్యర్థిని సీఎం చేస్తానని ప్రకటించలేదన్నారు. బీజేపీ మహిళలకు కేంద్ర మంత్రులుగా, రాష్ట్రపతిగా అవకాశం ఇచ్చిందన్నారు.

సిరిసిల్లలో దొరల దౌర్జన్య పాలన నడుస్తోందని, గడీల పాలనను బీజేపీ బద్దలుకొడుతుందన్నారు. ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని, తనను  ఎమ్మెల్యే అభ్యర్థిగా కంటే కార్యకర్తగా భావించాలన్నారు. సెస్ ఎన్నికల టైంలో పార్టీ తనను పాలక్‌‌గా నియమించిందన్నారు. ఆ ఎన్నికల్లో అధికార పార్టీ అవకతవకలకు పాల్పడి గెలిచిందన్నారు. ఇక్కడి బీజేపీ కార్యకర్తలను అధికార పార్టీ ఎన్ని కష్టాలు పెట్టినా పార్టీ కోసం నిలబడి పనిచేస్తున్నారని గుర్తుచేశారు. సమావేశంలో  జిల్లా ఎన్నికల ఇన్‌‌చార్జి, కర్ణాటక ఎమ్మెల్యే విఠల్ సోమన్న, జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డబోయిన గోపి, ఆడెపు రవీందర్, కుమ్మరి శంకర్, లీడర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.