సిరిసిల్ల తనకు కొత్త కాదని.. ఇక్కడ అహంకార మంత్రి (కేటీఆర్ ) ఉన్నారని ఆరోపించారు సిరిసిల్ల బీజేపీ అభ్యర్థి రాణిరుద్రమ. బీజేపీ వాళ్లపై ఎన్నో అక్రమ కేసులు పెట్టారని చెప్పారు. సిరిసిల్లలో బీజేపీ బలపడిందన్నారు. ప్రతి ఒక్క కార్యకర్త బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థేనని అన్నారు. ఇక్కడ యువరాజు గడి కోటలు బద్దలు కొడుతామన్నారు. బీజేపీ పార్టీ మహిళలకు, బీసీలకు పెద్దపీట వేసి.. సముచిత స్థానం కల్పిస్తోందన్నారు. సిరిసిల్లలో రాణి రుద్రమ మీడియా సమావేశం నిర్వహించారు. అంతకుముందు.. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆ తర్వాత సిరిసిల్లలో ఎన్నికల ప్రచారం ప్రారంభించారు.
ఇప్పటి వరకు ఏ పార్టీ కూడా బీసీ అభ్యర్థిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించలేదన్నారు రాణిరుద్రమ. బీజేపీ మాత్రమే బీసీలకు సముచిత స్థానం ఇచ్చిందని చెప్పారు. మహిళలకు ఏ పార్టీ ఇవ్వని ప్రాధాన్యత బీజేపీ మాత్రమే ఇచ్చిందన్నారు. మహిళలకు కేంద్ర మంత్రులుగా, రాష్ట్రపతిగా అవకాశం బీజేపీ పార్టీ కల్పించిందని తెలిపారు. తనను ఎమ్మెల్యే అభ్యర్థినిగా అవకాశం కల్పించడం గొప్ప విషయం అన్నారు. సిరిసిల్లలో దొరల దౌర్జన్య పాలన నడుస్తోందని ఆరోపించారు. బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి దొరల గడీల పాలనను బద్దలుకొడతామన్నారు. తాను ఎమ్మెల్యే అభ్యర్థిగా కంటే ఒక కార్యకర్తగా భావిస్తానని చెప్పారు.
ALSO READ :- Diwali Special: దీపావళి పండగ రోజు ఎన్ని దీపాలు వెలిగించాలి.... వాటి విశిష్టత ఏంటి..